Corona Virus: చెక్ పెట్టకుంటే డెల్టా ప్లస్ వేరియంట్ కూడా ఆందోళనకరమే: ఎయిమ్స్ చీఫ్
- డెల్టా వేరియంట్ నుంచి డెల్టా ప్లస్ వేరియంట్
- మరింత వేగంగా వ్యాపించే ప్రమాదం
- రోగనిరోధక శక్తిని తట్టుకునే సామర్థ్యం
- వ్యాక్సిన్ సామర్థ్యాన్నీ తప్పించుకునే లక్షణం
- లోతైన జన్యుక్రమ విశ్లేషణ అవసరం
- ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ రణ్‌దీప్ గులేరియా వెల్లడి
భారత్‌లో కొత్తగా వెలుగులోకి వచ్చిన డెల్టా ప్లస్ వేరియంట్ త్వరలో ఆందోళనకర రకంగా మారే అవకాశం ఉందని దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా హెచ్చరించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న డెల్టా వేరియంట్ నుంచే ఇది రూపాంతరం చెందిందని ఆయన తెలిపారు. దీన్ని కే417ఎన్ రకంగా ఆయన పేర్కొన్నారు. ఈ వేరియంట్‌పై గట్టి నిఘా పెట్టి నియంత్రించకపోయినట్లయితే.. ఆందోళకర రకంగా మారుతుందన్నారు.
కే417ఎన్లో జరిగిన రూపాంతరాన్ని బట్టి చూస్తే దీనికి మరింత వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోందని గులేరియా తెలిపారు. అలాగే రోగనిరోధక శక్తిని తట్టుకొనే శక్తి కూడా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. అలాగే వ్యాక్సిన్ సామర్థ్యం నుంచి సైతం తప్పించుకునే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో దీన్ని అంత తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు. ప్రజలు అజాగ్రత్తగా వ్యవహరిస్తే 3-4 నెలల్లో మరోసారి కేసులు విజృంభిస్తాయన్నారు.
తనని తాను బతికించుకోవడం కోసం వైరస్ అనేక రూపాంతరాలు చెందుతోందని.. ఈ క్రమంలో అనేక మందికి వ్యాపించే ప్రమాదం ఉందని గులేరియా హెచ్చరించారు. వైరస్ కట్టడిలో యూకేను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అలాగే వైరస్ వ్యవహరిస్తున్న తీరును అర్థం చేసుకోవాలంటే దానిపై లోతైన విశ్లేషణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం విస్తృతంగా జన్యుక్రమ విశ్లేషణ జరపాలన్నారు.