BCCI: ఒలింపిక్స్ కు వెళ్లే భారత అథ్లెట్లకు బీసీసీఐ రూ.10 కోట్ల ఆర్థికసాయం
- జులై 23 నుంచి టోక్యో ఒలింపిక్స్
- భారత్ నుంచి తరలివెళ్లనున్న భారీ బృందం
- అథ్లెట్ల సాధన, సన్నాహకాల కోసం బీసీసీఐ సాయం
- అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం
త్వరలో జపాన్ లో ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో భారత అథ్లెట్లకు బీసీసీఐ (భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు) భారీ మొత్తంలో ఆర్థికసాయం ప్రకటించింది. ఒలింపిక్స్ లో పాల్గొనే భారత అథ్లెట్ల శిక్షణ, సన్నాహాలకు రూ.10 కోట్లు ఇస్తున్నట్టు బీసీసీఐ వెల్లడించింది. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి బీసీసీఐ అధ్యక్ష కార్యదర్శులు సౌరవ్ గంగూలీ, జై షా కూడా హాజరయ్యారు.
టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన భారత అథ్లెట్లు మరింత మెరుగైన రీతిలో సన్నద్ధమయ్యేందుకు ఈ నిధి ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టు బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ నిధిని ఎలా ఉపయోగించుకుంటారన్న దానిపై కేంద్ర క్రీడల శాఖ, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) విధివిధానాలు ఖరారు చేస్తాయని వెల్లడించారు. కరోనా వ్యాప్తి కారణంగా ఇంతకుముందు వాయిదా పడిన టోక్యో ఒలింపిక్ క్రీడలు జులై 23 నుంచి జరగనున్నాయి.