Reliance group: 3 నెలల్లో 1000 శాతం పుంజుకున్న రిలయన్స్ గ్రూప్ మార్కెట్ విలువ!
- ఇటీవల తీసుకున్న అనుకూల నిర్ణయాలే కారణం
- మార్చిలో గ్రూప్ విలువ రూ.733 కోట్లు
- మేలో రూ.3,890 కోట్లు, జూన్ 18కి రూ.7,866 కోట్లు
- 50 లక్షల మంది రిటైల్ ఇన్వెస్టర్లకు లబ్ధి
అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ మార్కెట్ విలువ అనూహ్యంగా పెరిగింది. మూడు నెలల వ్యవధిలోనే 1000 శాతం పెరగడం గమనార్హం. మార్చిలో రూ.733 కోట్లుగా ఉన్న రిలయన్స్ గ్రూప్ మార్కెట్ విలువ మే నెలలో రూ.3,890 కోట్లకు.. జూన్ 18 నాటికి ఆ విలువ ఏకంగా రూ.7,866 కోట్లకు పెరిగింది.
గత 20 ట్రేడింగ్ సెషన్లలోనే రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్, రిలయన్స్ క్యాపిటల్ మార్కెట్ విలువ రెండింతలకు పైగా పెరిగింది. ప్రస్తుతం రిలయన్స్ పవర్ మార్కెట్ విలువ రూ.4,446 కోట్లుగా.. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విలువ రూ.2,767 కోట్లుగా.. రిలయన్స్ క్యాపిటల్ విలువ రూ.653 కోట్లుగా ఉంది. ఈ కంపెనీల్లో వాటాలున్న దాదాపు 50 లక్షల మంది రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్ విలువ పెరుగుదల వల్ల లాభపడ్డారు.
గత మూడు వారాల్లో తీసుకున్న పలు అనుకూల నిర్ణయాలే గ్రూప్ వాటాల విలువ పెరుగుదలకు కారణమైంది. ఓ ప్రమోటర్ కంపెనీ నుంచి రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లోకి రూ.550 కోట్ల పెట్టుబడులు సమీకరించనుండడం, కీలక ఆస్తుల్ని మానెటైజ్ చేయడం, కంపెనీపై ఉన్న రెడ్ ఫ్లాగ్‌ను యాక్సిస్, యెస్ బ్యాంక్ తొలగించడం వంటి పరిణామాలు కంపెనీ విలువ పెరుగుదలకు దోహదం చేశాయి.