Krishna District: కృష్ణా నదిలో ప్రేమ జంటపై అత్యాచారం కేసు.. నిందితుల కోసం జల్లెడ పడుతున్న పోలీసులు

Krishna and Guntur dist police searching for culprits in gang rape case
  • ప్రియుడిని బంధించి ప్రియురాలిపై సామూహిక అత్యాచారం
  • నిందితుల కోసం గాలిస్తున్న కృష్ణా, గుంటూరు జిల్లా పోలీసులు
  • ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు
సీతానగరం పుష్కరఘాట్ వద్ద కృష్ణా నది వద్ద యువకుడిని తాళ్లతో బంధించి అతడి ప్రియురాలిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుల కోసం పోలీసులు జల్లెడపడుతున్నారు. విజయవాడకు చెందిన ప్రేమ జంట శనివారం రాత్రి 9 గంటల సమయంలో సీతానగరం పుష్కరఘాట్ల వద్దకు వచ్చింది.

అక్కడ కాసేపు గడిపిన తర్వాత రైలు వంతెన సమీపంలో నడుస్తూ వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు అడ్డగించి వారిని బెదిరించారు. అనంతరం ప్రియుడిని తాళ్లతో కట్టేసి అతడి ప్రియురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత మత్స్యకారుల పడవలో నది అవతలి ఒడ్డువైపునకు వెళ్లిపోయారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.

కాగా, ఘటన జరిగిన సమయంలో చీకటిగా ఉండడంతో నిందితులను గుర్తించలేకపోయినట్టు బాధితులు తెలిపారు. నిందితుల కోసం రంగంలోకి దిగిన కృష్ణా, గుంటూరు జిల్లాల పోలీసులు బాధిత యువకుడిని వెంట తీసుకెళ్లి రెండు జిల్లాల్లోని అనుమానితులను గుర్తించాలని కోరుతున్నారు.

ఘటన జరిగిన ప్రాంతాన్ని నిన్న సాయంత్రం పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. పోలీసులు వేర్వేరు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. పోలీసుల రాకను గుర్తించిన కృష్ణా తీరంలోని ముగ్గురు వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని వెంటాడి పట్టుకున్నారు. అయితే తమపై దాడి చేసింది వారు కాదని బాధితుడు చెప్పడంతో వదిలిపెట్టారు.
Krishna District
Guntur District
Lovers
Gang Rape
Crime News

More Telugu News