WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్: వర్షం కారణంగా నాలుగో రోజు ఆట రద్దు

Fourth day play of WTC Final abandoned due to rain

  • భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్
  • సౌతాంప్టన్ లో జోరున వర్షం
  • చిత్తడిగా మారిన మైదానం
  • ఆటకు సాధ్యం కాదని తేల్చిన అంపైర్లు

సౌతాంప్టన్ లో వరుణుడు రెచ్చిపోతున్నాడు. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ నాలుగో రోజు ఆట వర్షం కారణంగా పూర్తిగా రద్దయింది. ఈ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండడంతో కనీసం ఒక్క సెషన్ కూడా సాధ్యపడలేదు. లంచ్ తర్వాత కూడా వర్షం తగ్గే సూచనలు కనిపించకపోవడంతో మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు ఆట రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 217 పరుగులకు ఆలౌట్ కాగా, కివీస్ తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్లకు 101 పరుగులు చేసింది. భారత్ స్కోరుకు ఇంకా 116 పరుగులు వెనుకబడే ఉంది. నాలుగో రోజు ఆట రద్దయిన నేపథ్యంలో, మ్యాచ్ కు ఇంకా రెండ్రోజుల సమయం మిగిలుంది. ఇప్పటికే తొలి రోజు ఆట రద్దు కావడంతో మ్యాచ్ కు రిజర్వ్ డే కేటాయించడం తెలిసిందే.

  • Loading...

More Telugu News