Almatti Dam: సగం నిండిన ఆలమట్టి జలాశయం.. తుంగభద్రకు 46 వేల క్యూసెక్కుల వరద
- కృష్ణా పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు
- 65.47 టీఎంసీలకు చేరుకున్న ఆలమట్టి నీటి మట్టం
- 20.07 టీఎంసీలుగా ఉన్న తుంగభద్ర నీటిమట్టం
- కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి నీటి ప్రవాహం
కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఆలమట్టి జలాశయ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా, నిన్న 1.41 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చి చేరడంతో నీటిమట్టం 65.47 టీఎంసీలకు చేరుకుంది. అంటే దాదాపు సగం నిండినట్టే. ఆలమట్టి దిగువన ఉన్న నారాయణపూర్‌కు 3,662, తుంగభద్ర జలాశయానికి 46 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. తుంగభద్ర బ్యారేజీ పూర్తిస్థాయి నిల్వసామర్థ్యం 100.86 టీఎంసీలు కాగా ప్రస్తుతం 20.07 టీఎంసీలుగా ఉంది.
మరోవైపు, గోదావరి నది పరీవాహక ప్రాంతంలో ఉన్న శ్రీరాంసాగర్‌కు 5,139, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 14,160 క్యూసెక్కులు వచ్చి చేరుతున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నంది, గాయత్రి ఎత్తిపోతల పథకం ద్వారా మధ్య మానేరుకు 12,182 క్యూసెక్కులు, నది ద్వారా దిగువ మానేరుకు 11,906 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది.