Ashok Gajapathi Raju: బొత్స, విజయసాయిరెడ్డి ఆ వివరాలను ఎందుకు కోరారు?: అశోక్ గజపతిరాజు
- మాన్సాస్ పై నివేదిక ఇవ్వాలని బొత్స ఆదేశించారు
- మాన్సాన్ ఈవోను విజయసాయి అనేక వివరాలు అడిగారు
- రెండేళ్లుగా సంచయిత, విజయసాయి ఆడిట్ పాటను పాడుతున్నారు
ఏపీ హైకోర్టు ఆదేశాలతో మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ పగ్గాలను టీడీపీ నేత అశోక్ గజపతిరాజు మరోసారి చేపట్టిన సంగతి తెలిసిందే. ట్రస్ట్ ఛైర్మన్ పదవి నుంచి తనను తప్పించిన తర్వాత... ట్రస్టులో ఏం జరిగిందనే అంశాలపై అశోక్ రాజు దృష్టి సారించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆయన పలు ప్రశ్నలు గుప్పించారు.
'శ్రీ బొత్స సత్యనారాయణ గారు తేది. 29.06.2019 న విజయనగరం కలెక్టర్ గారిని మాన్సాస్ పై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ఆ నివేదికను ఏ అంశాలపై కోరారు? ఏ ఉద్దేశ్యంతో కోరారు?
విజయనగరం ఎమ్మెల్యే శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు తేది. 20.10.2019 న ఆర్ధిక లావాదేవీల మీద వివరాలు ఇమ్మని మాన్సాస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని అడిగారు. ఆ వివరాల ద్వారా అయన ఏ అభిప్రాయానికి వచ్చారు? ఏమి చేయాలని ప్రతిపాదించారు?
శ్రీ విజయసాయిరెడ్డి తేది. 21.01.2020 న మాన్సాస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారిని చాలా వివరాలు అడిగారు. అయన ఈ వివరాల ద్వారా తీర్చుకోదలచిన అనుమానాలు ఏమిటి? అసలు ఈ వివరాలు కోరడంలో ఉద్దేశ్యం ఏమిటి?
సుమారు రెండు సంవత్సరాలుగా ఫోరెన్సిక్ ఆడిట్ పాటను సంచయితగారు, విజయసాయిరెడ్డి గారు పాడుతున్నారు. అసలు ఈ ఆడిట్ అంశంలో ముందు ఈ ప్రశ్నలకు సమాధానం రావాలి. ఈ ఫోరెన్సిక్ ఆడిట్ యొక్క క్లయింట్ ఎవరు? ఆడిట్ జరిగిందా? అలా అయితే నిందితులు ఎవరు? అటువంటి ఆడిట్ యొక్క ఆసక్తికరమైన ఫలితాలను చూసే అవకాశం ఉందా? కనుగొన్న వాటిని ఇప్పటివరకు ఎందుకు బహిరంగపరచడం లేదు?
ఇప్పుడు మీడియా ముందు అవే నివేదికలు కోరుతున్నారు. ఈ సన్నాయి నొక్కులు ఎన్ని రోజులు నడుస్తాయి? ఎంతకాలం ఇలా? ఇది ఎప్పటికి తేలుతుంది. ఈ ప్రహసనం జరుగుతున్నంత సేపు, మాన్సాస్ మరియు విద్యాసంస్థలపై దృష్టి పెట్టడం కష్టం. అవి అస్థిర పడుతూనే ఉంటాయి' అని అశోక్ రాజు అన్నారు.