United Nations: బాల్యాన్ని చిదిమేస్తున్న యుద్ధ సంక్షోభం!
- నివేదిక విడుదల చేసిన ఐక్యరాజ్యసమితి
- గతేడాది 19,379 మంది చిన్నారులపై అకృత్యాలు
- 2,479 మంది పిల్లలను చంపిన కిరాతకులు
యుద్ధ సంక్షోభం బాల్యాన్ని చిదిమేస్తోంది. రాజకీయం, అధికారం, పెత్తనం కోసం వివిధ దేశాల్లో సాగుతున్న సంక్షోభాలతో పిల్లల భవిష్యత్ నాశనం అవుతోంది. యుద్ధ సంక్షుభిత దేశాల్లో పిల్లలపై అకృత్యాలు భారీగా పెరగడమే అందుకు నిదర్శనం. గతేడాది కరోనా మహమ్మారి సమయంలో బడులు లేకపోవడం, పిల్లలు ఇంటి దగ్గరే ఉండడం వంటి కారణాలూ అందుకు ఆజ్యం పోశాయి. దీనిపై ఐక్యరాజ్యసమితి ‘పిల్లలు– యుద్ధ సంక్షోభం’ అనే నివేదికను విడుదల చేసింది.
దాని ప్రకారం గతేడాది పిల్లలపై 26,425 అకృత్యాలు జరిగాయి. అందులో గతేడాది 23,946 ఘటనలు జరిగితే.. అంతకుముందు ఏడాది జరిగిన 2,479 ఘటనలను 2020లో ఐరాస ధ్రువీకరించింది. ఆయా ఘటనల్లో 19,379 (14,097 బాలురు, 4,993 బాలికలు) మంది పిల్లలు బాధితులుగా మారారు. అల్లర్లు లేదా దాడుల కోసం పిల్లలను నియమించుకుని వారిని వాడుకోవడం, చంపడం, కొట్టడం, లైంగిక దాడులు, కిడ్నాప్ చేయడం వంటి దారుణాలు వారిపై చోటుచేసుకున్నాయి. ఆఫ్ఘనిస్థాన్, సిరియా, యెమన్, సోమాలియా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో వంటి దేశాల్లో ఆయా ఘటనలు ఎక్కువగా జరిగాయి.
ఆయా ఘటనల్లో ఎక్కువగా 8,521 మంది పిల్లలను దాడులు, ఇతర అసాంఘిక కార్యకలాపాల కోసం వాడుకునేందుకు నియమించారు. 2,674 మంది పిల్లలను చంపేశారు. 5,748 మందిని చావబాదారు. 4,156 మంది పిల్లలపై అమానవీయంగా ప్రవర్తించారు. 3,243 మంది పిల్లలను కిడ్నాప్ చేసి బందీలుగా మార్చారు. ఆసుపత్రులపై దాడులు తగ్గినా.. స్కూళ్లపై ఎక్కువయ్యాయి.