Anandaiah: ఆనందయ్య మందు ప్రమాదకరమన్న ప్రభుత్వం.. నా మందులో ఎలాంటి విషం లేదన్న ఆనందయ్య

AP government says to High Court that dangerous material is in Anandaiah medicine

  • ఆనందయ్య మందుపై హైకోర్టులో విచారణ
  • ఐదు ల్యాబుల్లో టెస్ట్ చేయించామన్న ప్రభుత్వ లాయర్
  • ఆయుష్ రీసర్చ్ సెంటర్ లో టెస్ట్ చేయించాలన్న ఆనందయ్య లాయర్

కరోనా వ్యాధి కోసం ఇస్తున్న ఆనందయ్య మందుపై ఈరోజు ఏపీ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఆనందయ్య ఇస్తున్న కంటి చుక్కల మందులో ఒక హానికారక పదార్థం ఉందని రాష్ట్ర ప్రభుత్వం తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. ఆనందయ్య చుక్కల మందును ఐదు ల్యాబుల్లో పరీక్షించామని... మందులో ఒక పదార్థం హానికరమని పరీక్షల్లో తేలిందని చెప్పారు.

ఈ క్రమంలో హైకోర్టు స్పందిస్తూ... ల్యాబ్ రిపోర్టులను తమ ముందు ఉంచాలని ఆదేశించింది. మరోవైపు ఆనందయ్య తరపు లాయర్ తన వాదనలను వినిపిస్తూ... చుక్కల మందును ఆయుష్ రీసర్చ్ సెంటర్ లో టెస్ట్ చేయించాలని కోర్టును కోరారు. అనంతరం తదుపరి విచారణను జులై 1కి కోర్టు వాయిదా వేసింది.

మరోవైపు ఆనందయ్య మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత 16 ఏళ్లుగా తాను కంటిమందును వేస్తున్నానని, ఎవరికీ ఇబ్బంది కలగలేదని చెప్పారు. తన మందులో ఎలాంటి విష పదార్థం లేదని తెలిపారు. ఎవరి కంటిచూపు దెబ్బతినలేదని... ఎవరికైనా ఇబ్బంది కలిగిందని చెబితే, మందు ఇవ్వడాన్ని తాను పూర్తిగా ఆపేస్తానని చెప్పారు. తన మందుకు కోర్టు అనుమతించకపోయినా తనకు వచ్చిన నష్టం ఏమీ లేదని... ప్రజలే ఇబ్బంది పడతారని వ్యాఖ్యానించారు.

కరోనా పాజిటివ్ వచ్చిన అందరికీ తన మందును ఉచితంగా ఇస్తున్నానని ఆనందయ్య చెప్పారు. తన పేరు చెప్పుకుని ఎవరైనా మందును అమ్ముకుంటున్నారేమో అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మందును అమ్ముకుంటున్న వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News