Population: ఎక్కువ మంది పిల్లల్ని కన్న వారికి రూ.లక్ష నజరానా: మిజోరాం మంత్రి ప్రకటన
- సర్టిఫికెట్ తో పాటు ట్రోఫీ
- జనాభా ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉందన్న మంత్రి
- ఇలాగైతే అభివృద్ధి జరగదని కామెంట్
- ఆ రాష్ట్ర జనాభా 10.91 లక్షలు
- చదరపు కిలోమీటరుకు 52 మంది
ఓ పక్క దేశ జనాభాను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుంటే.. మరో పక్క ఎక్కువ మంది పిల్లల్ని కంటే బహుమానం ఇస్తామంటూ పోటీలు పెడుతున్నారు. సాక్షాత్తూ మిజోరాంకు చెందిన మంత్రే ఈ ప్రకటన చేశారు. తన నియోజకవర్గంలో ఎవరికి ఎక్కువ మంది పిల్లలుంటే వారికి రూ.లక్ష నజరానా ఇస్తామంటూ ప్రకటించారు.
ఐజ్వాల్ ఈస్ట్ 2 నియోజకవర్గం నుంచి గెలిచిన క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి రాబర్ట్ రోమావియా రాయ్తే ఈ వ్యాఖ్యలు చేశారు. రాయ్తే ప్రమోటర్ గా వ్యవహరిస్తున్న ఐజ్వాల్ ఫుట్ బాల్ క్లబ్ (ఏఎఫ్ సీ)కు స్పాన్సర్ గా ఉన్న నార్త్ ఈస్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (ఎన్ ఈసీఎస్) కానుకను అందజేస్తుందన్నారు. డబ్బుతో పాటు సర్టిఫికెట్, ట్రోఫీని కూడా అందిస్తామన్నారు.
ఫాదర్స్ డే సందర్భంగా ఈ ప్రకటన చేశానని ఆయన చెప్పారు. మిజోరాంలో జనాభా బాగా తగ్గిపోతోందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మిజోరాం జనాభా ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉందన్నారు. వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే జనాభా ఎక్కువగానే ఉండాలన్నారు. తక్కువ జనాభా వల్ల చిన్న చిన్న వర్గాలైన మిజోస్ వంటి తెగల బతుకుదెరువు, అభివృద్ధిపై ప్రభావం పడుతుందన్నారు.
రాష్ట్ర విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకుని దానికి తగ్గట్టు జనాభా ఉండేందుకుగానూ పిల్లల్ని కనేలా యంగ్ మిజో అసోసియేషన్ వంటి స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని మంత్రి చెప్పారు. కాగా, 2011 జనాభా లెక్కల ప్రకారం మిజోరాం జనాభా 10.91 లక్షలు. రాష్ట్ర వైశాల్యం 21,087 చదరపు కిలోమీటర్లు. ఒక చదరపు కిలోమీటర్ కు 52 మంది మాత్రమే నివసిస్తున్నారు. అరుణాచల్ తర్వాత దేశంలో అతి తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం మిజోరాం. అరుణాచల్ ప్రదేశ్ లో చదరపు కిలోమీటర్ కు 17 మంది నివసిస్తుండగా.. జాతీయ సగటు 382గా ఉంది.