Mallikarjun Kharge: సోనియా, రాహుల్ ల నాయకత్వంలోనే పంజాబ్ ఎన్నికలకు వెళ్తాం: మల్లికార్జున ఖర్గే
- పంజాబ్ కాంగ్రెస్ లో తార స్థాయికి చేరుకున్న విభేదాలు
- ముగ్గురు సభ్యులతో ప్యానల్ ఏర్పాటు చేసిన సోనియా
- త్వరలోనే అంతా సర్దుకుంటుందన్న ఖర్గే
2022లో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆ పార్టీలోని విభేదాలు తారస్థాయికి చేరాయి. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పై నవజ్యోత్ సింగ్ సిద్దూ బహింరంగంగానే విమర్శలు గుప్పిస్తూ పార్టీలో కాక పుట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమరీందర్ సింగ్ ఢిల్లీకి చేరుకున్నారు. పంజాబ్ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య ప్యానల్ ను ఆయన కలిశారు. ఈ ప్యానల్ కు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే నాయకత్వం వహిస్తున్నారు.
సమావేశానంతరం ఖర్గే మీడియాతో మాట్లాడుతూ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సోనియాగాంధీ, రాహుల్ గాంధీల నాయకత్వంలోనే పోరాడుతామని చెప్పారు. పంజాబ్ కాంగ్రెస్ కు సంబంధించిన సమస్యలను పార్టీ హైకమాండ్ పరిష్కరిస్తుందని అన్నారు. ఇంతకు ముందే ప్యానల్ సభ్యులమందరం సమావేశమై అన్ని సమస్యలపై చర్చించామని చెప్పారు. పంజాబ్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సమాయత్తమవుతోందని అన్నారు. త్వరలోనే అంతా సర్దుకుంటుందని.. అందరూ కలిసే ఎన్నికల్లో పోరాడతారని చెప్పారు.
ఈ సమావేశానికి సిద్దూ ఎందుకు హాజరుకాలేదనే మీడియా ప్రశ్నకు సమాధానంగా... క్లారిటీ కోసమే అమరీందర్ సింగ్ ను ఢిల్లీకి పిలిపించామని ఖర్గే చెప్పారు. ఎవరికైనా ఎలాంటి సమస్యలు ఉన్నా పార్టీ హైకమాండ్ పరిష్కరిస్తుందని అన్నారు. సోనియా సూచన మేరకు అమరీందర్ తో ప్యానల్ చర్చలు జరిపిందని మరో కాంగ్రెస్ నేత హరీశ్ రావత్ తెలిపారు. పంజాబ్ కు సంబంధించిన పార్టీ నివేదికను సోనియాకు ప్యానల్ సమర్పించిన తర్వాత... ప్యానల్ సభ్యులతో అమరీందర్ సింగ్ భేటీ కావడం ఇదే తొలిసారి.
విశ్వసనీయ సమాచారం ప్రకారం పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అమరీందర్ సింగే ఉండాలని ప్యానల్ తన నివేదికలో తెలిపింది. అమరీందర్ సారథ్యంలోనే వచ్చే ఎన్నికలకు వెళ్లాలని సూచించింది. ముగ్గురు సభ్యుల ప్యానల్ లో మల్లికార్జున ఖర్గే, జేపీ అగర్వాల్, హరీశ్ రావత్ ఉన్నారు.