Brahmam Gari Matam: మళ్లీ మొదటికొచ్చిన బ్రహ్మంగారి మఠం వివాదం!
- జటిలంగా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి పదవి
- వారసత్వ పోరులో ఎవరూ వెనక్కితగ్గని వైనం
- ప్రభుత్వ జోక్యం కూడా విఫలం
- ఫలితాన్నివ్వని ఇతర మఠాధిపతుల ప్రయత్నాలు
కడప జిల్లా బనగానపల్లె బ్రహ్మంగారి మఠం నూతన పీఠాధిపతి వ్యవహారం ఇప్పట్లో తేలేట్టు కనిపించలేదు. బ్రహ్మంగారి మఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి పరమపదించగా, ఆయన వారసత్వంగా పీఠం ఎవరు అధిష్ఠించాలన్నది ప్రశ్నార్థకమైంది. తానే నూతన పీఠాధిపతి పదవికి అర్హుడ్నని వెంకటేశ్వరస్వామి పెద్ద భార్య కుమారుడు వెంకటాద్రి స్పష్టం చేస్తుండగా, తాను కూడా అర్హుడ్నేనంటూ రెండో కుమారుడు పట్టుబడుతున్నాడు.
ముఖ్యంగా, బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి అధికారాలు తనకు అప్పగించాలంటూ వెంకటేశ్వరస్వామి రెండో భార్య మహాలక్ష్మమ్మ కూడా రేసులో నిలిచారు. ఈ త్రిముఖ వివాదంలో ఏపీ ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు, శివస్వామి వంటి ఇతర పీఠాధిపతులు కూడా రంగంలోకి దిగారు.
ఇటీవల కొన్ని పరిణామాల నేపథ్యంలో సయోధ్య కుదిరి సమస్య ఓ కొలిక్కి వస్తుందనుకున్న తరుణంలో చర్చలు విఫలం అయ్యాయి. వెంకటేశ్వరస్వామి కుటుంబసభ్యులు ఈ అంశంపై అందరూ కలిసి చర్చించుకుని వస్తే పీఠాధిపతిపై నిర్ణయం తీసుకుంటామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రతిపాదన చేశారు. ఇదే అంశంలో ఆయన వెంకటాద్రి స్వామితోనూ, రెండో భార్యతోనూ చర్చించారు. కానీ, తనకు పీఠాధిపతి పదవి ఇవ్వాలంటూ మొదటి భార్య రెండో కుమారుడు పట్టుదలకు పోతుండడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.
మరోవైపు, కర్ణాటక రాజకీయ ప్రముఖుడు గాలి కరుణాకర్ రెడ్డి కూడా ఈ మఠం అంశంలో రంగప్రవేశం చేసినట్టు తెలుస్తోంది. ఆయన తన ప్రతినిధుల ద్వారా వెంకటేశ్వరస్వామి కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయానికి ప్రయత్నిస్తున్నట్టు వెల్లడైంది.
బ్రహ్మంగారి మఠం 11వ పీఠాధిపతిగా కొనసాగిన శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి కొన్నాళ్ల కిందట కన్నుమూశారు. ఆయనకు పెద్ద భార్య చంద్రావతమ్మ ద్వారా నలుగురు కుమారులు, రెండో భార్య మహాలక్ష్మమ్మ ద్వారా ఇద్దరు పిల్లలు కలిగారు. పెద్ద భార్య మరణానంతరం వెంకటేశ్వరస్వామి 63 ఏళ్ల వయసులో 24 ఏళ్ల మహాలక్ష్మమ్మను రెండో పెళ్లి చేసుకున్నారు. మహాలక్ష్మమ్మ పెద్ద కొడుకు గోవిందస్వామి వయసు 9 ఏళ్లే కావడంతో, తన కుమారుడి మైనారిటీ తీరే వరకు తానే మాతృశ్రీ హోదాలో మఠం బాధ్యతలు నిర్వర్తిస్తానని మహలక్ష్మమ్మ వాదిస్తున్నారు. ఆ మేరకు తమ వద్ద వీలునామా కూడా ఉందని ఆమె చెబుతున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఎవరికి వారే మఠాధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తుండడంతో ప్రభుత్వం కూడా ఏమీ చేయలేకపోయింది. మఠం కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయాలు కలగకుండా ఓ ప్రత్యేక అధికారిని మాత్రం నియమించింది.