Chandrababu: సంక్షేమం పేరుతో సీఎం జగన్ ప్రజలను మోసం చేస్తున్నాడు: చంద్రబాబు
- పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం
- సీఎం జగన్ పై ధ్వజం
- రూ.3 వేల పింఛను హామీ ఏమైందని నిలదీత
- డ్వాక్రా మహిళలను మోసం చేశాడని ఆరోపణ
టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు, ముఖ్యనేతలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. తమిళనాడులో సమర్థులను, నోబుల్ గ్రహీతలను సలహాదారులుగా పెట్టుకున్నారని, కానీ ఏపీలో అససమర్థులను సలహాదారులుగా పెట్టుకున్నారని విమర్శించారు. సంక్షేమం పేరుతో సీఎం జగన్ ప్రజలను మోసం చేస్తున్నాడని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు రూ.3 వేల పెన్షను హామీ ఏమైందని నిలదీశారు. రుణమాఫీ చేస్తానని డ్వాక్రా మహిళలను మోసం చేశాడని అన్నారు.
కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ లో ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు ఆరోపించారు. వారం రోజుల పాటు వ్యాక్సినేషన్ నిలిపివేసి, రికార్డు కోసం ఒక్కరోజే టీకాలు వేశారని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన ఉందని తెలిపారు. ధాన్యం బకాయిలు చెల్లించలేదని, పంటలకు గిట్టుబాటు ధర లేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో, ఈ నెల 29న రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో టీడీపీ ఆందోళనలు చేపడుతుందని తెలిపారు.