Nara Lokesh: సుప్రీంకోర్టు ఆదేశాలను ఏపీ ప్రభుత్వం గౌరవించి తక్షణమే పరీక్షలు రద్దు చేయాలి: నారా లోకేశ్
- పరీక్షల నిర్వహణపై సుప్రీం ఆగ్రహం
- ఒక్క ప్రాణం పోయినా సర్కారుదే బాధ్యత అని స్పష్టీకరణ
- మొండి పట్టుదల ఎందుకన్న లోకేశ్
- వ్యవస్థలను గౌరవించాలని హితవు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలు రాష్ట్రాలు పరీక్షలు జరిపేందుకు సంసిద్ధమవుతుండడం పట్ల సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్ పరీక్షలు జరిపేందుకు సిద్ధపడిన ఏపీ సర్కారుపైనా సుప్రీం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా, అందుకు రాష్ట్రానిదే బాధ్యత అవుతుందని విస్పష్టంగా హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. మొండిగా పరీక్షలు నిర్వహిస్తామంటున్న ఏపీ ప్రభుత్వం తీరుపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసిందని వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో ఏపీలో తక్షణమే పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
దేశమంతా రద్దు చేస్తే, ఏపీలో మాత్రం పరీక్షలు నిర్వహించి తీరుతామని ఎందుకు పట్టుబడుతున్నారో అర్థం కావడంలేదని విమర్శించారు. కొవిడ్ తీవ్రత దృష్ట్యా పరీక్షలు రద్దు చేయాలంటూ రెండు నెలలుగా పోరాడుతున్నా, మూర్ఖపు ఆలోచనలతో లక్షలాది విద్యార్థులను కొవిడ్ కోరల్లోకి నెట్టేందుకు జగన్ వెనుకాడడం లేదని మండిపడ్డారు.
సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చినా అఫిడవిట్ వేయని సర్కారు... ఇప్పుడు ఒక్క విద్యార్థికి కొవిడ్ సోకినా బాధ్యత వహించగలదా? పోయిన ప్రాణాలను జగన్ తిరిగి తీసుకురాగలరా? అని లోకేశ్ ప్రశ్నించారు. ఇప్పటికైనా వ్యవస్థల ఆదేశాలను గౌరవించి తక్షణమే పరీక్షల రద్దు నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.