Karanama Malleswari: ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీగా కరణం మల్లీశ్వరి!

Karanam Malleshwari appointed as Delhi Sports University Vice Chancellor

  • ఢిల్లీలో స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు
  • మొట్టమొదటి వీసీగా కరణం మల్లీశ్వరి
  • ఉత్తర్వులు జారీచేసిన ఢిల్లీ సర్కారు
  • వివిధ క్రీడాంశాల్లో డిగ్రీ పొందే అవకాశం
  • డిగ్రీ నుంచి పీహెచ్ డీ వరకు కోర్సులు

ఢిల్లీ సర్కారు క్రీడల విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా, దేశ రాజధానిలో ఏర్పాటు చేస్తున్న ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వైస్ చాన్సలర్ గా ఏపీకి చెందిన ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్, పద్మశ్రీ కరణం మల్లీశ్వరిని నియమించారు. ఈ మేరకు ఆప్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రీడా విశ్వవిద్యాలయానికి కరణం మల్లీశ్వరి మొట్టమొదటి వీసీ అవుతారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. త్వరలోనే ఈ నియామకానికి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేస్తామని వివరించారు.

ఇటీవల స్పోర్ట్స్ యూనివర్సిటీ గురించి చెబుతూ, క్రీడాకారులు ఇకపై ఇక్కడ తాము ఎంచుకున్న క్రీడాంశంలో డిగ్రీ పొందవచ్చని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వెల్లడించారు. వారు ఇతరత్రా మరే డిగ్రీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఒలింపిక్ క్రీడల్లో దేశానికి కనీసం 50 వరకు పసిడి పతకాలు తెచ్చేలా క్రీడాకారులను తీర్చిదిద్దడమే ఈ వర్సిటీ ఏర్పాటు వెనుకున్న ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ క్రీడారంగంలో దేశాన్ని గర్వించేలా చేస్తుందన్న నమ్మకం ఉందని స్పష్టం చేశారు. డిగ్రీ స్థాయి నుంచి పీహెచ్ డీ వరకు వివిధ క్రీడాంశాల్లో వర్సిటీ కోర్సులను అందిస్తుందని తెలిపారు.

  • Loading...

More Telugu News