Rains: తెలంగాణలో మళ్లీ భానుడి భగభగలు.. నల్గొండలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
- ముఖం చాటేసిన వర్షాలు
- బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
- పలు ప్రాంతాల్లో 37 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు
తెలంగాణలో భానుడు మళ్లీ ప్రతాపం చూపిస్తున్నాడు. రుతుపవనాల మందగమనంతో వానలు ఆగిపోయాయి. రుతుపవనాలు ప్రవేశించిన తొలి వారంలో విస్తారంగా కురిసిన వానలు ఆ తర్వాత ముఖం చాటేశాయి. గత వారం రోజులుగా రాష్ట్రంలో ఒక్క చినుకు కూడా రాలకపోగా మరో నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణపై పొడి మేఘం ఆవరించి ఉండడంతో వానల కోసం ఎదురుచూపులు తప్పవని వాతావరణ అధికారులు ఇప్పటికే తేల్చి చెప్పారు.
వానలు లేకపోవడంతో సూర్యుడి ప్రతాపం పెరుగుతోంది. నిన్న రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోయాయి. నల్గొండలో అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే ఇది 4.2 డిగ్రీలు అధికం. మిగతా ప్రాంతాల్లోనూ 37 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు బంగాళాఖాతంలో 2.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.