Corona Virus: సెప్టెంబరు-అక్టోబరు మధ్య విరుచుకుపడనున్న కరోనా థర్డ్‌వేవ్: ఐఐటీ కాన్పూర్

Corona Third Wave hits india in between September and October

  • రెండో దశ కంటే మూడో దశ ప్రభావం తక్కువే
  • భౌతిక దూరం, కొవిడ్ నిబంధనలు పాటిస్తే గరిష్ఠస్థాయికి చేరుకోవడం ఆలస్యం
  • చాలా రాష్ట్రాల్లో ఐదు శాతం కంటే తక్కువకు పడిపోయిన పాజిటివిటీ రేటు

దేశంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో అది నిజమేనని ఐఐటీ కాన్పూర్ నిపుణులు తేల్చి చెప్పారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య దేశంలో థర్డ్ వేవ్ వ్యాప్తి గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని వారు అంచనా వేశారు.

దేశంలో జులై 15వ తేదీ వరకు అన్‌లాక్ ప్రక్రియ కొనసాగితే మూడో దశ గరిష్ఠాన్ని తాకే అవకాశంపై మూడు విభాగాలుగా అంచనా వేసినట్టు ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ రాజేశ్ రంజన్ తెలిపారు. తిరిగి యథాస్థితికి రావడం, ఉత్పరివర్తనాల ప్రభావం, కొవిడ్ నిబంధనలు పాటిస్తే కొవిడ్ ప్రభావం తగ్గడం వంటి అంశాలను అధ్యయనం సందర్భంగా పరిగణనలోకి తీసుకున్నట్టు చెప్పారు.

అక్టోబరులో మూడో దశ గరిష్ఠానికి చేరుకున్నప్పటికీ రెండో దశతో పోలిస్తే దీని తీవ్రత తక్కువగా ఉంటుందన్నది ఇందులో మొదటిది కాగా, వైరస్ వ్యాప్తి రెండో దశ గరిష్ఠం కన్నా ఎక్కువగా ఉంటే అది సెప్టెంబరు నాటికే కనిపించొచ్చన్నది రెండోది. ఈ దశలో ఉత్పరివర్తనాల ప్రభావం తక్కువగా ఉంటుందని తేల్చారు. నిబంధనలు పాటిస్తే కరోనా వైరస్ ప్రభావం తగ్గడం మూడోది. భౌతిక దూరంతోపాటు కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తే కొవిడ్ గరిష్ఠస్థాయి అక్టోబరు చివరి వరకు ఆలస్యం కావొచ్చని నిపుణులు అంచనా వేశారు.

ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, మణిపూర్, సిక్కిం మినహా దేశంలో రెండోదశ పూర్తిగా క్షీణించిందని అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ రాజేశ్ రంజన్, మహేంద్రవర్మ తెలిపారు. దేశంలో ప్రస్తుతం కేరళ, గోవా, సిక్కిం, మేఘాలయ రాష్ట్రాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు పది శాతానికిపైగా ఉండగా, చాలా రాష్ట్రాల్లో ఐదు శాతం తక్కువగా ఉందని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌ను పరిగణనలోకి తీసుకుని నిర్వహించిన మరో అధ్యయన వివరాలను త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News