Maharashtra: మహారాష్ట్ర ప్రభుత్వం కూలిపోవడం ఖాయం: ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు
- 2024 ఎన్నికల్లో మాదే విజయం
- వర్షాకాల సమావేశాలు రెండు రోజులేనా?
- ప్రభుత్వాన్ని కూల్చాలని అనుకోవడం లేదు
మహారాష్ట్రలోని మహావికాశ్ అఘాడీ ప్రభుత్వం ఏదో ఒక రోజు కుప్పకూలడం ఖాయమని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం కూలే వరకు తాము బలమైన ప్రతిపక్షంగానే ఉంటామన్నారు. నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కరోనా పేరు చెప్పి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించకుండా తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇప్పుడు కూడా వర్షాకాల సమావేశాలను రెండు రోజులే నిర్వహించాలని ప్రతిపాదించడం సరికాదని మండిపడ్డారు. బీఏసీ సమావేశం నుంచి తాము తప్పుకోవడంపై మాట్లాడుతూ.. రైతులు, ప్రజలు, విద్యార్థులు, శాంతిభద్రతలు, మరాఠా రిజర్వేషన్లు తదితర సమస్యలపై చర్చించేందుకు రెండు రోజుల సమయం చాలా తక్కువని అన్నారు. అందుకనే బీఏసీ సమావేశం నుంచి తప్పుకున్నట్టు ఫడ్నవీస్ పేర్కొన్నారు.
బీజేపీతో చేతులు కలపాలంటూ శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌కు లేఖ రాయడంపై ఫడ్నవీస్ స్పందిస్తూ.. అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చాలని తాము అనుకోవడం లేదని స్పష్టం చేశారు. ఏమైనా, 2024 ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.