Stephen Hawking: కృష్ణ బిలాలపై హాకింగ్​ సిద్ధాంతమే నెగ్గింది!

MIT Scientists Prove Stephen Hawking Theory On Black Holes

  • బ్లాక్ హోల్స్ తో పాటే దాని ఉపరితలంలోనూ పెరుగుదల
  • నిరూపించిన ఎంఐటీ శాస్త్రవేత్తలు
  • 130 కోట్ల ఏళ్ల క్రితం నాటి సంఘటన ఆధారంగా పరిశోధన

బ్లాక్ హోల్స్ (కృష్ణ బిలాలు)పై ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ప్రతిపాదించిన సిద్ధాంతమే నెగ్గింది. దానిని తాజాగా అమెరికాలోని ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు నిరూపించారు. ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ఆధారంగా కృష్ణ బిలాల ఉపరితలం లేదా బాహ్య పరిమాణం ఎప్పటికీ తగ్గిపోదని 1971లో హాకింగ్ ప్రతిపాదించారు.

థర్మోడైనమిక్స్ (ఉష్ణగతిశాస్త్రం)లోని రెండో నియమం ప్రకారం.. జడోష్ణం (ఎంట్రపీ) కచ్చితంగా పెరుగుతూనే ఉంటుందని, అది ఉపరితలానికి ఎప్పుడూ అనుపాతంగానే ఉంటుందని హాకింగ్ చెప్పారు. అంటే ఎంట్రపీ పెరిగే కొద్దీ కృష్ణ బిలాల ఉపరితలం కూడా పెరుగుతూనే ఉంటుందని ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం. ఇప్పుడు అదే సిద్ధాంతం కరెక్ట్ అని ప్రస్తుత పరిశోధనకు నేతృత్వం వహించిన ఎంఐటీ శాస్త్రవేత్త మ్యాక్సిమిల్లో ఐసీ అన్నారు. కృష్ణ బిలాలకు సంబంధించి ఆయన చెప్పిందే ప్రాథమిక సూత్రం అని పేర్కొన్నారు. బ్లాక్ హోల్ పరిమాణం పెరిగే కొద్దీ దాని ఉపరితలం కూడా పెరుగుతుందని తేల్చి చెప్పారు.


దీనిని నిర్ధారించేందుకు శాస్త్రవేత్తలు 130 కోట్ల ఏళ్ల క్రితం రెండు కృష్ణ బిలాలు అత్యంత వేగంతో దగ్గరగా వచ్చినప్పుడు ఏర్పడిన గురుత్వాకర్షణ తరంగాలు, స్పేస్ టైంలోని తరంగాలను విశ్లేషించారు. అడ్వాన్స్ డ్ లేజర్ ఇంటర్ ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ (లైగో) 2015లో తొలిసారిగా వీటిని గుర్తించింది. 4 వేల కిలోమీటర్ల పొడవునా రెండు భాగాలుగా ఉండే దీనిలోని లేజర్ బీమ్ (లేజర్ కాంతి కిరణం).. స్పేస్ టైంలోని అతి సూక్ష్మ మార్పులనూ సులువుగా పసిగట్టేస్తుంది.

అదే పద్ధతిలో కలిసిపోక ముందు.. ఆ తర్వాత రెండు కృష్ణబిలాలు ద్రవ్యరాశులు (బరువు), అవి తిరిగే విధానాన్ని అంచనా వేశారు. రెండింటి ఉపరితల వైశాల్యాలు, ఆ రెండు కలిశాక ఏర్పడిన వైశాల్యాన్ని లెక్కగట్టారు. రెండు కృష్ణ బిలాలు ఎదురెదురుగా వేగంగా దూసుకొచ్చినప్పుడు గురుత్వ తరంగాలు పెరిగిపోయాయని నిర్ధారించారు. ఆ తర్వాత ఆ రెండు కలిసిపోయి అతిపెద్ద తరంగాలను పుట్టించాయన్నారు. ఆ రెండింటి కలయికతో కొత్తగా ఏర్పడిన కృష్ణ బిలం ఉపరితలం భారీగా పెరిగిపోయిందని తేల్చి చెప్పారు.

  • Loading...

More Telugu News