Prime Minister: ‘థర్డ్​ ఫ్రంట్​’ వచ్చినా మోదీ హవాకు తిరుగులేదు!: తాజా సర్వేలో వెల్లడి

Does third front have a leader to beat Modi in PM race What 12 state survey shows

  • ప్రధానిగా 32.8% మంది ఆయనకే ఓటు
  • ప్రత్యామ్నాయంగా రాహుల్ కి 17.2% ఓట్లు
  • 15వ స్థానంలో తెలంగాణ సీఎం కేసీఆర్
  • ఆయన్ను ఎంచుకున్న 0.7 శాతం మంది
  • 12 రాష్ట్రాల్లో 20 వేల మందిపై ప్రశ్నమ్ సర్వే

కేంద్రంలో బీజేపీకి, కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా వేరే కూటమిని తీసుకొచ్చేందుకు జోరుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. దీనిపై నిన్ననే 8 పార్టీలతో బీజేపీ మాజీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ సమావేశమయ్యారు. ప్రత్యామ్నాయ కూటమిపై చర్చించారు.

అయితే, తమ సమావేశం ‘థర్డ్ ఫ్రంట్’ గురించి కాదని పైకి చెబుతున్నా, చర్చ మొత్తం కేంద్ర రాజకీయాలకు ప్రత్యామ్నాయంపైనే సాగింది. మరి, ఆ ‘థర్డ్ ఫ్రంట్’ గానీ, ప్రత్యామ్నాయ పార్టీగానీ బీజేపీ, మోదీ హవాను అడ్డుకుంటాయా? దీనిపైనే 'ప్రశ్నమ్' అనే సంస్థ సర్వే చేసింది. తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లోని 397 లోక్ సభ స్థానాలు, 2,309 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 20 వేల మంది ఓటర్ల అభిప్రాయాలను తీసుకుంది.


అందులో ప్రధాని మోదీ హవా ఏమాత్రం తగ్గలేదు. 32.8 శాతం మంది మోదీనే తదుపరి ప్రధానిగా కోరుకున్నారు. ఆ తర్వాత రాహుల్ గాంధీకి ఓటేశారు. 17.2 శాతం మంది రాహుల్ ను ప్రధానిగా చూడాలనుకుంటున్నారు. ఇక, ప్రాంతీయ పార్టీల విషయానికొస్తే మమతా బెనర్జీకి 7 శాతం మంది, యోగి ఆదిత్యనాథ్ కు 6.1 శాతం మంది ప్రధానిగా ఓటేశారు. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను 0.7 శాతం మంది ఎన్నుకున్నారు. 16 మంది ప్రధాని అభ్యర్థుల జాబితాలో ఆయనది 15వ స్థానం.


అయితే, తదుపరి ప్రధానిగా ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లలో శరద్ పవార్ ఒకరు. ఆయన్ను కేవలం 0.9 శాతం మందే ప్రధానిగా చూడాలనుకుంటున్నారు. అమిత్ షాకు కూడా అంతగా ఆదరణ లభించలేదు. ఆయనకూ 0.9 శాతం ఓట్లే వచ్చాయి. తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, కేరళ, గుజరాత్, రాజస్థాన్, బీహార్, కర్ణాటక, ఝార్ఖండ్ లలో ఈ సర్వే చేశారు. సర్వే ప్రకారం ఇప్పటికీ ప్రధానిగా నరేంద్ర మోదీనే ఎక్కువ మంది కోరుకుంటున్నట్టు తేలింది. ఆయనకు ప్రత్యామ్నాయంగా రాహుల్ గాంధీ నిలిచారు.

  • Loading...

More Telugu News