Telangana High Court: తెలంగాణలో జులై 1 నుంచి పాఠశాలల ప్రారంభంపై హైకోర్టులో విచారణ
- అన్ని తరగతుల విద్యార్థులు స్కూళ్లకు హాజరు కావాలా? అని ప్రశ్నించిన హైకోర్టు
- ప్రత్యక్ష బోధనతో పాటు, ఆన్ లైన్ క్లాసులు కూడా ఉంటాయన్న ప్రభుత్వం
- త్వరలోనే విధివిధానాలను ఖరారు చేస్తామని కోర్టుకు వివరణ
జులై 1వ తేదీ నుంచి తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు విద్యాసంస్థలను తెరవనుండటంపై ఈరోజు హైకోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా హైకోర్టుకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వివరాలను సమర్పించారు. విచారణ సందర్భంగా... అన్ని తరగతుల విద్యార్థులు స్కూళ్లకు హాజరు కావాలా? అని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సమాధానంగా... రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం విధివిధానాలను ఖరారు చేస్తుందని సందీప్ సమాధానమిచ్చారు.
ప్రత్యక్ష బోధనతో పాటు, ఆన్ లైన్ క్లాసులు కూడా ఉంటాయని.... విద్యార్థులు క్లాసులకు కచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేదని హైకోర్టుకు సందీప్ తెలిపారు. అయితే, విద్యా సంస్థల నుంచి తల్లిదండ్రులు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. మరోవైపు హైకోర్టు స్పందిస్తూ... క్లాస్ రూమ్స్ లో సోషల్ డిస్టెన్స్ పాటించడం కష్టమని అభిప్రాయపడింది. దీంతో, కోర్టు సూచనలను తాము పరిగణనలోకి తీసుకుంటామని... త్వరలోనే నిబంధనలను రూపొందిస్తామని సందీప్ తెలిపారు. వాదనల అనంతరం హైకోర్టు స్పందిస్తూ... వారంలోగా పూర్తి వివరాలను అందించాలని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేసింది.