Balram Naik: కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌పై ఈసీ మూడేళ్ల నిషేధం
- 2019 ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంటు స్థానానికి పోటీ
- నిర్ణీత గడువులోగా ఎన్నికల వ్యయ వివరాలను సమర్పించని వైనం
- గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్
కేంద్రమాజీ మంత్రి బలరాం నాయక్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి లోక్‌సభకు పోటీ చేసిన ఆయన ఎన్నికల ఖర్చుల వివరాలను నిర్ణీత గడువులోగా సమర్పించలేకపోయారు. దీనిని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆయనపై చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా మూడేళ్లపాటు చట్టసభలకు పోటీ చేయకుండా నిషేధం విధించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. బలరాం నాయక్ 2009లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.