Warangal: ఆకాశ, భూ మార్గాల్లో వరంగల్ మెట్రో.. డీపీఆర్ రూపొందించిన మహారాష్ట్ర మెట్రో

Warangal ready for neo metro rail DPR Ready

  • ఊపందుకున్న వరంగల్ నియో మెట్రో ప్రాజెక్టు
  • 15 కిలోమీటర్ల మేర నిర్మాణం
  • నియో విధానంలో తగ్గనున్న వ్యయం
  • డీపీఆర్ రూపొందించిన ‘మహా మెట్రో’

తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన ట్రైసిటీ వరంగల్‌లో మెట్రో రైలు ప్రాజెక్టు ప్రణాళిక ఊపందుకుంది. ఆకాశ, భూ మార్గాల్లో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ సిద్ధం చేసింది. నిజానికి ఇక్కడ హైదరాబాద్‌ తరహాలోనే ఆకాశ మార్గంలో 15 కిలోమీటర్ల మేర మెట్రోను నిర్మించాలని తొలుత నిర్ణయించారు. అయితే, ఇందులో కొన్ని మార్పులు చేసిన ‘మహా మెట్రో’ సంస్థ సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసింది.

నియో విధానంలో మెట్రోను నిర్మించడం ద్వారా దాదాపు 2 వేల కోట్ల వరకు ఆదా అవుతుందని పేర్కొంది. తాజా మార్పులతో మెట్రో ఏడు కిలోమీటర్ల మేర భూ మార్గంలో, 8 కిలోమీటర్ల మేర ఆకాశ మార్గంలో నడుస్తుంది. తాజా డీపీఆర్‌ను  కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా)కు చేరింది. త్వరలోనే దీనిని కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపనున్నట్టు మహా మెట్రో మేనేజింగ్ డైరెక్టర్ బ్రిజేష్ దీక్షిత్ తెలిపారు.

నియో మెట్రో వరంగల్ ప్రాజెక్టుకు రూ. 1000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. సాధారణ విధానంలో కిలోమీటరు మార్గం నిర్మించేందుకు రూ. 180 కోట్లు ఖర్చవుతుంది. అయితే, మహామెట్రో రూపొందించిన తాజా డీపీఆర్‌తో ఇది రూ. 60 కోట్లకు తగ్గుతుందని భావిస్తున్నారు. 2041 నాటికి వరంగల్ జనాభా 30 లక్షలకు చేరుతుందని అంచనా వేసి అందుకు అనుగుణంగా ఈ డీపీఆర్‌ను తీర్చిదిద్దారు.

ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోకు నియో మెట్రో సాంకేతికత పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ రైలు రబ్బరు టైర్లపై నడుస్తుంది. వరంగల్ రోడ్లు దీనికి అతికినట్టు సరిపోతాయని మహా మెట్రో పేర్కొంది. ఆటోమెటిక్ టికెటింగ్ విధానంతో నిర్వహణ ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి. సాధారణ మెట్రో నిర్వహణ కోసం కిలోమీటరుకు 35 మంది సిబ్బంది అవసరం కాగా, నియో విధానంలో 15 మంది సరిపోతారని మహా మెట్రో పేర్కొంది.

  • Loading...

More Telugu News