Andhra Pradesh: అప్పటి వరకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపండి: ఏపీకి కృష్ణా యాజమాన్య బోర్డు ఆదేశం
- ఏపీ జలవనరుల కార్యదర్శికి కృష్ణా బోర్డు లేఖ
- డీపీఆర్ సమర్పించి, ఆమోదం పొందేంత వరకు పనులు నిలిపివేయాలని ఆదేశం
- ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కూడా ఫిర్యాదు చేసిందన్న బోర్డు
రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ముందుకెళ్లవద్దని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) సమర్పించిన తర్వాత దానికి ఆమోదం లభించేంత వరకు పనులు నిలిపివేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు బోర్డు సభ్యుడు హెచ్‌కే మీనా ఏపీ జలవనరుల కార్యదర్శికి లేఖ రాశారు. పనులు చేపట్టవద్దంటూ ఫిబ్రవరిలో జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను ఈ లేఖలో గుర్తు చేశారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి పనులు జరుగుతున్నాయో, లేదో చెప్పాలని అప్పట్లో జాతీయ హరిత ట్రైబ్యునల్ కృష్ణాబోర్డు నిపుణుల కమిటీని ఆదేశించింది. అయితే, నిపుణుల కమిటీ పర్యటనకు ఏపీ అవకాశం ఇవ్వడం లేదని పేర్కొన్న మీనా.. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులపై తెలంగాణ ప్రభుత్వం కూడా ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. కాబట్టి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను సమర్పించాలని, అది ఆమోదం పొందాకే ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్లాలని ఆ లేఖలో స్పష్టం చేశారు.