Mekapati Goutham Reddy: కేంద్రం చేతిలో మైనర్ పోర్టుల నిర్వహణ అంటే రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీయడమే: మంత్రి మేకపాటి
- పోర్టుల ముసాయిదా బిల్లుపై మేకపాటి స్పందన
- బిల్లుపై అభ్యంతరం
- అధ్యయనానికి సమయం కావాలని వెల్లడి
- నిపుణుల కమిటీ వేస్తామని వివరణ
పోర్టుల అంశంపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. మైనర్ పోర్టుల నియంత్రణ కేంద్రం చేతిలోకి వెళితే రాష్ట్రాల ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. భారత పోర్టుల ముసాయిదా బిల్లు నేపథ్యంలో మేకపాటి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ బిల్లుపై తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని వెల్లడించారు. బిల్లుపై అధ్యయనానికి కొంత సమయం అవసరమని కేంద్రానికి తెలిపినట్టు వివరించారు. ఓ నిపుణుల కమిటీ వేసి అధ్యయనం జరుపుతామని పేర్కొన్నారు.
ఏపీ పోర్టుల గురించి చెబుతూ, రామాయపట్నం పోర్టు పనులు ఈ నవంబరులో ప్రారంభం అవుతాయని వెల్లడించారు. వచ్చే 5 సంవత్సరాల్లో 6 పోర్టులను అభివృద్ధి చేసుకోవడంపై దృష్టి సారించామని మంత్రి మేకపాటి చెప్పారు. మారిటైమ్ బోర్డుకు దీర్ఘకాలిక ప్రాతిపదికన నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు.