Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు ఓటుకు నోటు వ్యవహారం వెలుగు చూశాక జగన్ పై 30 కేసులు బనాయించారు: సజ్జల

Sajjala opines on cases over CM Jagan

  • సీఎం జగన్ కేసుల ఎత్తివేతపై సజ్జల స్పందన
  • కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసులని వెల్లడి
  • గత పదేళ్లుగా కుట్రలు జరుగుతున్నాయని వివరణ
  • పథకం ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ

సీఎం జగన్ పై నమోదైన కేసుల ఎత్తివేత అంశంపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సీఎం జగన్ పై గతంలో కేసులు నమోదు చేశారని ఆరోపించారు. చంద్రబాబు ఓటుకు నోటు వ్యవహారం వెలుగు చూశాక, జగన్ పై ఇష్టం వచ్చిన రీతిలో 30 కేసుల వరకు నమోదయ్యాయని వెల్లడించారు. అవి అసలు కేసులే కాదని పేర్కొన్నారు.

గత 10 సంవత్సరాలుగా జగన్ పై కుట్రలు జరుగుతూనే ఉన్నాయని వివరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు వీరంగం వేస్తున్నాయని అన్నారు. కొన్ని చానళ్లు దుష్ప్రచారం సాగిస్తున్నాయని, కేసులు వేస్తూ రాష్ట్ర సర్కారు పనితీరుకు అడ్డంకులు సృష్టిస్తున్నాయని తెలిపారు.

గతంలో టీడీపీ నేతలపై ఉన్న కేసులను చంద్రబాబు ప్రభుత్వం ఎత్తేసిందని, వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు నేర్పరి అని సజ్జల పేర్కొన్నారు. వ్యవస్థల్లోని కీలక వ్యక్తులను కుట్రలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా పథకం ప్రకారం అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారని వెల్లడించారు.

తెలంగాణ నేతలు విద్వేషాలు పెంచేలా మాట్లాడుతున్నారు: ప్రాజెక్టులపై సజ్జల స్పందన

ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల అంశంపైనా సజ్జల స్పందించారు. కొందరు తెలంగాణ నేతలు విద్వేషాలు పెంచేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆవేశంతో, పరుషంగా మాట్లాడడం వల్ల ఏ సమస్యా పరిష్కారం కాదని హితవు పలికారు. తెలంగాణ నేతలు మాట్లాడే మాటలను వారి విచక్షణకే వదిలేస్తున్నామని తెలిపారు. తాము వారి కంటే ఎక్కువే మాట్లాడగలమని, కానీ అందువల్ల ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకునే పరిస్థితి లేదని పేర్కొన్నారు. అయినప్పటికీ తెలంగాణ సీఎంతో కలిసి ప్రాజెక్టులపై చర్చించేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారని సజ్జల స్పష్టం చేశారు. అలాగని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని అన్నారు.

  • Loading...

More Telugu News