Sachin Tendulkar: కోహ్లీ, పుజారా నిలబడుంటే డ్రా చేసుకునే అవకాశం ఉండేది: సచిన్
- సౌతాంప్టన్ లో భారత్, కివీస్ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్
- విజేతగా నిలిచిన న్యూజిలాండ్
- కోహ్లీ, పుజారా వెంటవెంటనే అవుటయ్యారన్న సచిన్
- భారత జట్టుపై ఒత్తిడి పెరిగిపోయిందని వెల్లడి
సౌతాంప్టన్ లో జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో భారత్ నిరాశ కలిగిస్తూ ఓటమి పాలవడం పట్ల క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. కేవలం పది బంతుల తేడాతో కెప్టెన్ విరాట్ కోహ్లీ, కీలక బ్యాట్స్ మన్ ఛటేశ్వర్ పుజారా అవుట్ కావడం టీమిండియా అవకాశాలను దారుణంగా దెబ్బతీసిందని సచిన్ అభిప్రాయపడ్డాడు. వారిద్దరూ క్రీజులో ఎక్కువ సేపు ఉండుంటే ఆట మరోలా ఉండేదని, కనీసం భారత్ డ్రా చేసుకునేందుకు అవకాశాలు ఉండేవని వివరించాడు. టీమిండియా ఓటమికి పరోక్షంగా ఈ ఇద్దరి వైఫల్యమే కారణమని సచిన్ తెలిపాడు.
ఆటకు చివరి రోజున తొలి సెషన్ ఎంతో కీలకమని తాను ముందే చెప్పానని అన్నాడు. కోహ్లీ, పుజారా వెంటవెంటనే అవుట్ కావడంతో జట్టు ఒత్తిడికి గురైందని, ఆపై వరుసగా వికెట్లు కోల్పోయిందని ఈ బ్యాటింగ్ మ్యాస్ట్రో విశ్లేషించాడు. ఇక, మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ లో విజేతగా అవతరించిన న్యూజిలాండ్ జట్టుకు సచిన్ శుభాకాంక్షలు తెలియజేశాడు.