Telangana: తెలంగాణలో ఈరోజు నుంచి స్కూళ్లు, కాలేజీలకు హాజరుకానున్న అధ్యాపకులు
- జులై 1 నుంచి తెలంగాణలో తెరుచుకోనున్న విద్యాసంస్థలు
- ఈ రోజు నుంచి టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ హాజరు కావాలని ఆదేశించిన ప్రభుత్వం
- 3 నెలల తర్వాత విద్యాసంస్థలకు హాజరవుతున్న అధ్యాపకులు
తెలంగాణలో విద్యాసంస్థలను రెగ్యులర్ గా నిర్వహించడానికి సర్వం సిద్ధమవుతోంది. జులై 1 నుంచి పాఠశాలలు, కాలేజీలు ప్రారంభమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణ విద్యాశాఖ కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈరోజు నుంచి పాఠశాలల అధ్యాపకులు, కాలేజీ లెక్చరర్లతో పాటు నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా విద్యాసంస్థలకు హాజరు కావాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో దాదాపు 3 నెలల తర్వాత టీచర్లు, లెక్చరర్లు విద్యాసంస్థలకు తిరిగి హాజరవుతున్నారు.
మరోవైపు, విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్న నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ కీలక సూచనలు చేసింది. విద్యాలయాలు పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించింది. సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, అన్ని తరగతుల పిల్లలు స్కూళ్లకు హాజరు కావాల్సిందేనా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని హైకోర్టుకు ప్రభుత్వం తెలియజేసింది.