Ishant Sharma: బంతిని ఆపే ప్రయత్నంలో గాయపడ్డ ఇషాంత్.. చేతివేలికి కుట్లు

Wounded Ishant Sharma gets stitches

  • టెస్ట్ ఛాంపియన్ షిప్ సెకండ్ ఇన్నింగ్స్ లో గాయపడ్డ ఇషాంత్ 
  • పది రోజుల్లో గాయం మానిపోతుందని చెప్పిన బీసీసీఐ అధికారి
  • ఆటగాళ్లందరూ లండన్ చేరుకున్నారని వెల్లడి

న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ మ్యాచ్ సందర్భంగా ఇండియన్ పేసర్ ఇషాంత్ శర్మ గాయపడ్డాడు. రెండో ఇన్నింగ్స్ లో తన బౌలింగ్ లో బ్యాట్స్ మెన్ కొట్టిన ఓ బంతిని ఆపేందుకు ఇషాంత్ డైవ్ చేశాడు. ఈ ప్రమాదంలో అతని కుడిచేతి మధ్య, ఉంగరపు వేళ్లకు గాయాలయ్యాయి.

వేలి నుంచి రక్తం రావడంతో వెంటనే అతన్ని మైదానం నుంచి తీసుకెళ్లిపోయారు. అనంతరం గాయపడిన వేలికి వైద్యులు కుట్లు వేశారు. దీనిపై బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ, ఇషాంత్ కు అయిన గాయం పెద్దదేమీ కాదని, పది రోజుల్లో కుట్లు మానిపోతాయని చెప్పారు. ఇంగ్లండ్ తో జరగనున్న టెస్ట్ సిరీస్ కు ఇంకా ఆరు వారాల సమయం ఉందని... ఆలోగా అతను కోలుకుంటాడని తెలిపారు.

టెస్ట్ ఛాంపియన్ షిప్ ముగియడంతో టీమిండియా ఆటగాళ్లకు కావాల్సినంత విరామం దొరికిందని సదరు అధికారి తెలిపారు. నిన్న సాయంత్రమే ఆటగాళ్లందరూ సౌతాంప్టన్ నుంచి లండన్ కు చేరుకున్నారని చెప్పారు. 20 రోజుల వరకు బ్రిటన్ లో వారికి ఇష్టం వచ్చిన చోట విహరించవచ్చని తెలిపారు. వింబుల్డన్, యూరో గేమ్స్ ఇలా వారికి ఇష్టమైన చోటుకు వెళ్లొచ్చని తెలిపారు. జులై 14న అందరూ మళ్లీ లండన్ లో ఒకే చోటుకు చేరుకుంటారని చెప్పారు. ఆ తర్వాత లండన్ నుంచి తొలి టెస్టు జరిగే నాటింగ్ హామ్ కు చేరుకుంటారని తెలిపారు.

  • Loading...

More Telugu News