Peddireddi Ramachandra Reddy: నాడు కేసీఆర్ మాటలకు ప్రత్యక్ష సాక్షిని నేనే: ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- ఏపీ, తెలంగాణ మధ్య జలయుద్ధం
- వ్యాఖ్యలతో వేడెక్కిస్తున్న ఉభయ రాష్ట్రాల మంత్రులు
- రాయలసీమకు నీరిస్తామని కేసీఆర్ చెప్పారన్న పెద్దిరెడ్డి
- గతంలో జగన్ తోనే ఈ మాటలు అన్నారని వెల్లడి
తెలుగు రాష్ట్రాల జలయుద్ధంలో ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా రంగప్రవేశం చేశారు. రాయలసీమకు తాగు, సాగునీరు ఇచ్చేలా చూడాలని కేసీఆర్ అన్నారని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. రాయలసీమకు నీరిచ్చేందుకు తమవంతు కృషి చేస్తామని గతంలో కేసీఆర్ చెప్పారని వెల్లడించారు. కేసీఆర్ స్వయంగా జగన్ తోనే ఈ మాటలు అన్నారని స్పష్టం చేశారు. నాడు కేసీఆర్ మాటలకు ప్రత్యక్ష సాక్షిని తానేనని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.
తెలంగాణ ఏర్పడ్డాక వైఎస్సార్ ను కేసీఆర్ పొగిడింది నిజం కాదా ? అని ప్రశ్నించారు. తెలంగాణకు వైఎస్ ఎంతో మేలు చేశారని కేసీఆర్ అన్నారని వివరించారు. కానీ ఇప్పుడు తెలంగాణ మంత్రులు వైఎస్ విషయంలో చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని పెద్దిరెడ్డి హితవు పలికారు.
తెలంగాణ ప్రస్తుతం చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదని, ఏపీకి రావాల్సిన వాటాను మాత్రమే వాడుకుంటున్నామని ఉద్ఘాటించారు. ఎక్కువ నీరు వాడుకోవాలన్న ఆలోచన జగన్ ప్రభుత్వానికి ఉండదని స్పష్టం చేశారు.