Mariyamma: మరియమ్మ కుటుంబానికి న్యాయం చేయాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు... సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్
- అడ్డగూడూరులో లాకప్ డెత్
- ఓ చోరీ కేసులో మరియమ్మ అరెస్ట్
- లాకప్ లో మరణించిన వైనం
- ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- సీఎం కేసీఆర్ ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో మరియమ్మ అనే ఎస్సీ మహిళను చోరీ కేసులో పోలీసులు అరెస్ట్ చేయగా, ఆమె లాకప్ లో చనిపోవడం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రాచకొండ సీపీ మహేశ్ భగవత్... అడ్డగూడూరు ఎస్సె మహేశ్ తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. కాగా, మరియమ్మ లాకప్ డెత్ అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ ను కలిశారు. మరియమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హైదరాబాదులోని ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను భట్టి విక్రమార్క మీడియాకు తెలిపారు. మరియమ్మ అనే ఎస్సీ మహిళ లాకప్ లో దారుణంగా చనిపోయిన విషయాన్ని సీఎం కేసీఆర్ కు వివరించామని చెప్పారు. లాకప్ డెత్ కు కారకులపై చర్యలు ఉంటాయని సీఎం హామీ ఇచ్చారని, అప్పటికప్పుడు డీజీపీకి ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు.
మరియమ్మ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరగా, సమ్మతించారని భట్టి వివరించారు. మరియమ్మ కుమారుడు ఉదయ్ కిరణ్ కు ప్రభుత్వ ఉద్యోగం, రూ.15 లక్షల ఎక్స్ గ్రేషియా, నివాస గృహం, ఇద్దరు కుమార్తెలకు చెరో రూ.10 లక్షల ఆర్థికసాయం అందించేందుకు సీఎం అంగీకరించారని తెలిపారు.