Japan: జపాన్ లో పనిదినాలు వారానికి నాలుగు రోజులే... ప్రభుత్వం కీలక సిఫారసులు
- ప్రజల జీవనశైలిలో మార్పుకు సర్కారు ప్రయత్నం
- ఉద్యోగులు ఉత్తేజంతో పనిచేస్తారని భావన
- వివాహాలు పెరుగుతాయని ఆలోచన
- తద్వారా జనాభా పెరుగుతుందని అంచనా
ప్రపంచవ్యాప్తంగా పలు ప్రయివేటు కంపెనీలు వారానికి ఐదు రోజులే పనిదినాలుగా అమలు చేయడం తెలిసిందే. అయితే, జపాన్ ప్రభుత్వం సంచలనాత్మక రీతిలో వారానికి నాలుగు రోజులే పనిదినాలు అంటూ కీలక సిఫారసులు చేసింది. కుటుంబం, ఉద్యోగం మధ్య వ్యక్తులు సమతుల్యత సాధించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని జపాన్ ప్రభుత్వం భావిస్తోంది. జనాభా పెరుగుదల లేకపోవడం జపాన్ లో ఓ సమస్య. అధిక పనిగంటల ఒత్తిడితో కుటుంబ సభ్యులు కలుసుకునే సమయం తగ్గిపోతోందని జపాన్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
నాలుగు రోజుల పనిదినాలను అమలు చేస్తే, ఉద్యోగులు తమ కుటుంబంతో గడిపేందుకు అత్యధిక సమయం లభిస్తుందని, తద్వారా మానసికంగా ఉద్యోగులు ఎంతో తాజాగా ఉండేందుకు వీలవుతుందని భావిస్తోంది. ఈ మేరకు ప్రైవేటు సంస్థలకు ప్రతిపాదనలు చేసింది. నాలుగు రోజుల పనిదినాలు మినహాయించి మిగిలిన ఖాళీ సమయంలో ఉద్యోగులు తమ నైపుణ్యాలు పెంచుకునే వీలుంటుందని, ప్రజలు హాయిగా తిరుగుతూ షాపింగ్ చేస్తే ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకుంటుందని జపాన్ ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఇక, పెళ్లికాని వారైతే ఈ ఖాళీ సమయంలో పెళ్లి ఆలోచనలు చేసి, తగిన భాగస్వామిని వెదికి జీవితంలో స్థిరపడతారని, తద్వారా జనాభా పెరిగేందుకు ఇదొక మార్గం అవుతుందని తలపోస్తోంది. అయితే ఈ సిఫారసులను ప్రైవేటు సంస్థలు ఏమేరకు అంగీకరిస్తాయన్నది సందేహమే.