Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ యూటర్న్.. ఖాళీ స్టేడియాల్లోనే ఒలింపిక్స్!
- ప్రేక్షకులను అనుమతిస్తామని నాలుగు రోజుల క్రితం ప్రకటన
- గరిష్ఠంగా 10 వేల మందిని అనుమతిస్తామన్న కమిటీ
- ఖాళీ స్టేడియాల్లో నిర్వహించాలన్న అంశం పరిగణనలోనే ఉందని తాజాగా ప్రకటన
ప్రపంచ క్రీడా సంబరం ఒలింపిక్స్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్న వేళ టోక్యో ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ యూటర్న్ తీసుకుంది. ప్రేక్షకులను పరిమిత సంఖ్యలో అనుమతిస్తామని నాలుగు రోజుల క్రితం ప్రకటించిన కమిటీ తాజాగా మరో ప్రకటన చేస్తూ.. ఖాళీ స్టేడియంలోనే క్రీడలు నిర్వహించాలన్న ప్రతిపాదన ఇంకా తమ పరిశీలనలోనే ఉందని పేర్కొంది. ఈ మేరకు కమిటీ అధ్యక్షురాలు సీకో హషిమోటో నిన్న వెల్లడించారు.
వచ్చే నెల 23 నుంచి ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. ఒలింపిక్స్‌కు ప్రేక్షకులను అనుమతించబోమని చాలా నెలల క్రితమే ప్రకటించారు. అయితే, స్థానికుల విషయంలో కొంత సడలింపు ఇచ్చారు. 50 శాతానికి మించకుండా గరిష్ఠంగా 10 వేల మందిని అనుమతించాలని నిర్ణయించారు. అయితే, ఇప్పుడు ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్స్‌ను నిర్వహించాలన్న అంశం తమ పరిగణనలోనే ఉందన్న సీకో వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జపాన్‌లో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతోనే ప్రేక్షకులు లేకుండానే క్రీడల నిర్వహణకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.