Andhra Pradesh: ఏపీపీఎస్సీ పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూలు ఎత్తివేస్తూ కీలక నిర్ణయం
- సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ
- గ్రూప్-1 సహా అన్ని కేటగిరీ పోస్టులకూ ఇంటర్వ్యూల నుంచి మినహాయింపు
- పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని భావిస్తోన్న ప్రభుత్వం
పోటీ పరీక్షల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఈ రోజు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉద్యోగ నియామకాల్లో ఇకపై రాత పరీక్షల్లో ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది.
ఏపీపీఎస్సీ నిర్వహిస్తోన్న ఉద్యోగ నియామకాల రాతపరీక్షల సమయంలో విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ నిర్వహించే ఉద్యోగ నియామక రాత పరీక్షల్లో గ్రూప్-1 సహా అన్ని కేటగిరీ పోస్టులకూ ఇంటర్వ్యూల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది.
ఉద్యోగాల నియామకాల ప్రక్రియ విషయంలో పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూలు తొలగించాలని చాలా కాలంగా డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే.