Niranjan Reddy: ఆంధ్రప్రదేశ్ అవతరణే పెద్ద కుట్ర: తెలంగాణ రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి
- ఏపీ ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రాజెక్టులను పట్టించుకోలేదు
- ఏపీ అక్రమ ప్రాజెక్టును అడ్డుకుంటాం
- ఏపీ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి కావాలి
ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమమని తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఈ అక్రమ ప్రాజెక్టును అడ్డుకుని తీరుతామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణే పెద్ద కుట్ర అని... తెలంగాణ నీటిని దోచుకునేందుకే ఆంధ్రప్రదేశ్ ని ఏర్పాటు చేశారని విమర్శించారు.
ఏపీ ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రాజెక్టులను పట్టించుకోలేదని... ఏపీ అవతరణతో మహబూబ్ నగర్ జిల్లాలకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఏపీ ప్రాజెక్టులు అక్రమమని, తెలంగాణ నిర్మిస్తున్నవి సక్రమ ప్రాజెక్టులని అన్నారు. ఆనాడు జలదోపిడీకి సహకరించినవాళ్లు ఇప్పుడు సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు.
విభజన చట్టం ప్రకారం ఏపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టాలంటే కేంద్రం అనుమతిని తీసుకోవాలని నిరంజన్ రెడ్డి చెప్పారు. కేంద్రం ద్వారా నీటి కేటాయింపులను జరిపించుకోవాలని అన్నారు. ముందు చూపుతో జోగులాంబ బ్యారేజ్ ను కేసీఆర్ ప్రతిపాదించారని చెప్పారు. కరోనా కష్టకాలంలో కూడా రైతులకు రైతుబంధు నిధులు అందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని అన్నారు. రైతుబంధు కింద రూ. 7,360 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేశామని చెప్పారు.