Etela Rajender: ఈటల రాజేందర్ నుంచి హుజూరాబాద్ ప్రజలకు విముక్తి: టీఆర్ఎస్ ఎమ్మెల్యే రవిశంకర్
- ఈటలను సొంత సోదరుడిలా కేసీఆర్ చూసుకున్నారు
- పార్టీలో మంచి స్థానాన్ని కల్పించారు
- రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చినప్పటికీ బీజేపీలో చేరారు
- హుజూరాబాద్ ప్రజలంతా టీఆర్ఎస్ కు మద్దతు తెలుపుతున్నారు
హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఆ స్థానంలో కొన్ని నెలల్లో ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ బలాన్ని పెంచుకోవడానికి టీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత సుంకె రవిశంకర్ ఈ రోజు ఇల్లందకుంట మండలం బూర్జునూర్ లో మీడియాతో మాట్లాడుతూ ఈటలపై విమర్శలు గుప్పించారు.
ఈటల రాజేందర్ నుంచి హుజూరాబాద్ ప్రజలకు విముక్తి కలిగిందని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఆయనను సొంత సోదరుడిలా చూసుకున్నారని, పార్టీలో మంచి స్థానాన్ని కల్పించారని తెలిపారు. ఇన్నాళ్లు ఈటలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించారని చెప్పుకొచ్చారు.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చినప్పటికీ ఈటల ఆ పార్టీలో చేరడం ఏంటని ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలంతా తమ పార్టీకే మద్దతు తెలుపుతున్నారని చెప్పుకొచ్చారు. ఆ ప్రాంత సమస్యలను సీఎం కేసీఆర్ పరిష్కరించారని తెలిపారు.