Maoists: మొన్న హరిభూషణ్​.. నేడు ఆయన భార్య.. కరోనాతో మృతి!

Maoist Haribhushan Wife Dies of Covid 19

  • మే 24న సమ్మక్క మృతి
  • మహమ్మారితో కుంగుబాటు
  • దండకారణ్యంలో కలవరం
  • లొంగిపోతే వైద్యం చేయిస్తామన్న మహబూబాబాద్ ఎస్పీ

దండకారణ్యంలోని మావోయిస్టుల్లో కరోనా కేసులు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. మొన్నటికి మొన్న మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ కరోనాతో చనిపోతే... తాజాగా ఆయన భార్య జజ్జర్ల సమ్మక్క అలియాస్ శారద చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ నెల 24న ఆమె కరోనాతోనే మరణించినట్టు సమాచారం. అయితే, కరోనాతో ఆమె చాలా కుంగిపోయిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

హరిభూషణ్ మృతితో ఇప్పటికే ఆయన గ్రామం గంగారాంలో విషాదం అలముకుంది. ఇప్పుడు సమ్మక్క మరణ వార్తల నేపథ్యంలో ఆ విషాదం మరింత పెరిగింది. సమ్మక్కకు కొన్ని రోజుల క్రితమే జబ్బు చేసిందని తెలుస్తోంది. గతంలో చర్ల–శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేసిన శారద.. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్టు సమాచారముందని మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి చెప్పారు. కరోనా బారిన పడిన మావోయిస్టులు లొంగిపోవాలని, పోలీస్ శాఖ తరఫున మెరుగైన వైద్యం చేయిస్తామని హామీ ఇచ్చారు.

కాగా, హరిభూషణ్ మృతదేహాన్ని అప్పగించకుండా మావోయిస్టులు తమను మోసం చేశారంటూ ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా పనిచేసిన ఆయనకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని నిలదీశారు. ఆయన చితాభస్మం లేకుండా కర్మకాండలు ఎలా జరిపించాలన్నారు. ఛత్తీస్ గఢ్ లోని ఏ గ్రామంలోనైనా మృతదేహాన్ని ఉంచినా.. తెచ్చుకుని అంత్యక్రియలు చేసుకునేవాళ్లమన్నారు.

  • Loading...

More Telugu News