Uttar Pradesh: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ నిలిపివేత.. మహిళా పారిశ్రామికవేత్త మృతి

woman entrepreneur vandana mishra died in kanpur stuck in jam during presidents arrival in kanpur

  • యూపీలోని కాన్పూరులో ఘటన
  • ట్రాఫిక్‌ జామ్‌లో గంటపాటు చిక్కుకుపోయిన వందన మిశ్రా
  • పోలీసులను వేడుకున్నా కనికరించని వైనం
  • విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి.. క్షమాపణ చెప్పిన పోలీసు కమిషనర్

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ నిలిపివేయడంతో అందులో చిక్కుకుపోయిన ఓ మహిళ మృతి చెందింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిందీ ఘటన. అనారోగ్యం పాలైన భారత పరిశ్రమల సంఘం (ఐఐఏ) కాన్పూరు శాఖ మహిళా విభాగం అధ్యక్షురాలు వందన మిశ్రాను ఆమె భర్త శరద్ మిశ్రా కారులో ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. అదే సమయంలో రాష్ట్రపతి కాన్వాయ్ రావడంతో పోలీసులు ట్రాఫిక్‌ను ఎక్కడికక్కడ నిలిపివేశారు. దాదాపు గంటపాటు ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో వందనకు సరైన సమయంలో చికిత్స అందక మరణించారు. రాష్ట్రపతి కాన్వాయ్ వెళ్లిపోయిన తర్వాత పోలీసులు వాహనాలకు అనుమతిచ్చారు. దీంతో శరద్ మిశ్రా ఆసుపత్రికి చేరుకున్నారు. వందనను పరీక్షించిన వైద్యులు ఆమె మార్గమధ్యంలోనే మరణించినట్టు నిర్ధారించారు.

తన భార్య ప్రాణాపాయ స్థితిలో ఉందని, విడిచిపెట్టాలని వేడుకున్నప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని శరద్ మిశ్రా కన్నీళ్లు పెట్టుకున్నారు. సకాలంలో ఆసుపత్రికి తెచ్చి ఉంటే బతికేదని వైద్యులు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలిసిన రాష్ట్రపతి విచారం వ్యక్తం చేశారు. కాన్పూరు పోలీస్ కమిషనర్ అసీం అరుణ్ ఈ ఘటనపై క్షమాపణలు తెలిపారు. ఓ ఎస్సై, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. కాగా, వందన అంత్యక్రియలకు పోలీస్ కమిషనర్ అసీం అరుణ్, కలెక్టర్ హాజరయ్యారు. బాధిత కుటుంబానికి రాష్ట్రపతి సందేశాన్ని తెలియపరిచారు.

  • Loading...

More Telugu News