KCR: అఖిలపక్ష సమావేశానికి టీడీపీని పిలవకపోవడం బాధాకరం: కేసీఆర్‌కు బక్కని నర్సింహులు లేఖ
- ప్రగతి భవన్‌లో ఈ ఉదయం 11.30 గంటలకు సమావేశం
- 32 మంది నేతలను ఆహ్వానించిన ప్రభుత్వం
- తమను పిలవకపోవడం బాధాకరమన్న టీడీపీ
- ఎన్నికల గిమ్మిక్కన్న బీజేపీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు బహిరంగ లేఖ రాశారు. దళితుల సమస్యలపై ప్రభుత్వం నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశానికి టీడీపీని ఆహ్వానించకపోవడం బాధాకరమని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నవారు అందరినీ సమానంగా చూడాలని అన్నారు. సమావేశంలో తమ అభిప్రాయాలను తెలిపే అవకాశం కల్పించాలని కోరారు.
కాగా, సీఎం కేసీఆర్ నేతృత్వంలో దళిత సాధికారతపై నేడు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు బీజేపీ ప్రకటించింది. కేసీఆర్ ఆధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితుల్ని మోసం చేస్తున్నారని ఆరోపించింది. అఖిలపక్ష సమావేశాన్ని ఎన్నికల గిమ్మిక్కుగా పేర్కొన్న బీజేపీ.. అందుకే ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు తెలిపింది.
కాగా, ఈ ఉదయం 11.30 గంటలకు ప్రగతి భవన్‌లో జరగనున్న అఖిలపక్ష సమావేశానికి 32 మంది నేతలను ఆహ్వానించారు. ఇందులో దళిత సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, విప్‌లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, ఎంఎస్ ప్రభాకర్‌రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, శాసనసభాపక్ష నేతలు, అక్బరుద్దీన్ ఒవైసీ, భట్టి విక్రమార్క, రాజాసింగ్, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ ఎంపీలు మందా జగన్నాథం, మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మోత్కుపల్లి నర్సింహులు, ఆరేపల్లి మోహన్ తదితరులను ప్రభుత్వం ఈ సమావేశానికి ఆహ్వానించింది.