Sonu Sood: సోనూ సూద్ ను కలిసిన కడప జిల్లా ఎమ్మార్పీఎస్ నేతలు
- ముంబయి వెళ్లిన వీరబల్లి మండల వాసులు
- అంబేద్కర్ విగ్రహావిష్కరణకు రావాలని ఆహ్వానం
- సానుకూలంగా స్పందించిన సోనూ సూద్
- కాలు కోల్పోయిన విద్యార్థికి ఆపన్నహస్తం!
కొన్నాళ్ల కిందట సినిమా రంగం వరకే పరిమితమైన సోనూ సూద్ ఖ్యాతి నేడు దేశవ్యాప్తమైంది. కరోనా కష్టకాలంలో చేస్తున్న సేవలతో మారుమూల ప్రాంతాల్లోనూ సోనూ సూద్ పేరు మార్మోగిపోతోంది. ఇక అసలు విషయానికొస్తే... కడప జిల్లా వీరబల్లి మండలానికి చెందిన ఎమ్మార్పీఎస్ నేతలు ముంబయిలో సోనూ సూద్ ను కలిశారు. గడికోట గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణకు రావాలంటూ ఆయనను ఆహ్వానించారు. ఎమ్మార్పీఎస్ నేతల విజ్ఞప్తి పట్ల సోనూ సూద్ సానుకూలంగా స్పందించారు.
అంతేకాదు, రెండేళ్ల కిందట రోడ్డు ప్రమాదం కారణంగా ఒక కాలు కోల్పోయిన వెంకట సాయిచంద్ర అనే విద్యార్థిని కూడా ఎమ్మార్పీఎస్ నేతలు సోనూ సూద్ వద్దకు తీసుకెళ్లారు. ఆ విద్యార్థి పరిస్థితి పట్ల చలించిపోయిన సోనూ సూద్... ముంబయిలోనే ఉండి వైద్యం చేయించుకోవాలని, ఖర్చులు తాను భరిస్తానని హామీ ఇచ్చినట్టు ఎమ్మార్పీఎస్ నేతలు వివరించారు.