Serena Williams: ఒలింపిక్స్‌ బరి నుంచి తప్పుకున్న మరో టెన్నిస్‌ దిగ్గజం

Serena Williams decided to go out from Olympics

  • సెరెనా విలియమ్స్‌ కీలక నిర్ణయం
  • కారణాలు చాలా ఉన్నాయని వ్యాఖ్య
  • కూతురుని వదిలి ఉండలేకేనన్న సంకేతం
  • కరోనా మూలంగా కుటుంబ సభ్యులకు అనుమతి నిరాకరణ

టోక్యో ఒలింపిక్స్‌ బరి నుంచి మరో టెన్నిస్‌ దిగ్గజం తప్పుకుంది. 23 గ్రాండ్‌ స్లామ్‌ గెలుచుకున్న టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలయమ్స్‌ ఈసారి ఒలింపిక్స్‌లో ఆడడం లేదని ప్రకటించింది. ఒలింపిక్‌కు వెళుతున్న ఆటగాళ్ల జాబితాలో తాను లేనని.. ఆ విషయం తనకూ తెలుసునంది. ప్రీ వింబుల్డన్‌ విలేకరుల సమావేశంలో భాగంగా మాట్లాడుతూ ఆదివారం ఆమె తన నిర్ణయం ప్రకటించింది.

ఒలింపిక్స్‌ నుంచి తప్పుకోవాలన్న తన నిర్ణయం వెనుక అనేక కారణాలున్నాయన్నారు. అయితే, కొవిడ్‌ నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్‌లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. విదేశీ క్రీడాభిమానులను అనుమతించడం లేదు. అలాగే ఆటగాళ్ల కుటుంబ సభ్యులను సైతం అనుమతించడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో తన చిన్నారి కూతురు ఒలంపియాకు దూరం కావాల్సి రావొచ్చన్న బెంగ వల్లే ఆమె ఈ నిర్ణయం తీసుకొని ఉంటారని క్రీడా వర్గాల్లో వినిపిస్తోంది.

మరోవైపు ఇప్పటికే 23 గ్రాండ్‌ స్లామ్‌లు సాధించిన సెరెనా మరొక్కటి తన ఖాతాలో వేసుకుంటే ఇప్పటి వరకు మార్గరెట్‌ కోర్ట్‌ పేరిట ఉన్న 24 గ్రాండ్‌ స్లామ్‌ల రికార్డు సమమవుతుంది. మరోవైపు ఒలింపిక్స్‌లో సెరెనాకు మంచి రికార్డు ఉంది. 2000 సంవత్సరంలో సిడ్నీలో తొలి ఒలింపిక్స్ ఆడిన ఆమె సోదరి వీనస్‌తో కలిసి డబుల్స్‌ విభాగంలో బంగారు పతకం కైవసం చేసుకుంది. తర్వాత బీజింగ్‌, లండన్‌లో జరిగిన ఒలింపిక్స్‌ల్లోనూ సోదరితో కలిసి డబుల్స్‌లో స్వర్ణ పతకాలు సాధించింది. 2012 ఒలింపిక్స్‌లో సింగిల్స్ విభాగంలోనూ బంగారు పతకం సాధించారు.

మరోవైపు ఇప్పటికే టాప్‌ ప్లేయర్లు రాఫెల్‌ నాదల్‌, డొమినిక్‌ థీమ్‌ సైతం ఒలింపిక్స్‌ టోర్నీ నుంచి తప్పుకున్నారు. రోజర్‌ ఫెదరర్‌ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

  • Loading...

More Telugu News