AlankritaSahay: నిర్మాత ప్రవర్తన భరించలేక, సినిమాను వదులుకున్నా: నటి అలంకృతా సహాయ్
- 2018 నుంచి నటిస్తున్న అలంకృతా సహాయ్
- పంజాబీ నిర్మాత వేధించారని ఫిర్యాదు
- ప్రవర్తన తట్టుకోలేకనే ప్రాజెక్టు వదులుకున్నానని వెల్లడి
తొలి పంజాబీ చిత్రంలో నటించే అవకాశాన్ని వదులుకున్న పంజాబీ నటి అలంకృతా సహాయ్, ఓ ప్రముఖ దినపత్రికకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన నిర్ణయానికి కారణాలను వెలిబుచ్చుతూ, చిత్ర నిర్మాతపై సంచలన ఆరోపణలు చేశారు. సినిమా నిర్మాతల్లో ఒకరు తనతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించారని, సెట్స్ లోనే ఇదంతా జరిగిందని తెలిపారు.
"చిత్ర యూనిట్ లో మిగతా వారంతా మంచిగానే ఉన్నారు. ఒక నిర్మాతకు మాత్రం మంచి బుద్ధి లేదు. అనైతికంగా, అసభ్యంగా ఆయన ప్రవర్తిస్తుంటే తట్టుకోలేకనే సినిమా అరంగేట్రాన్ని వదులుకున్నాను. అటువంటి అనుభవాలను నేను మరెక్కడా ఎదుర్కోలేదు. నేను పనిచేసిన వారంతా ఎంతో మంచివారే. ఈయన మాత్రం కాదు" అని తన అనుభవాలను తెలిపింది.
ఎవరూ కూడా హద్దులు దాటరాదని, నోటిని అదుపులో ఉంచుకోవాలని, కానీ, ఈ వ్యక్తి పెట్టిన హింస అంతా ఇంతా కాదని వాపోయిన అలంకృతా సహాయ్, దాన్ని తానెందుకు భరించాలని ప్రశ్నించింది. తనకూ ఆత్మాభిమానం ఉందని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తనదేనని చెప్పింది. ఆ నిర్మాత తనను ఎంతో వేధించాడని, దాన్ని తట్టుకోలేకనే ప్రాజెక్టు నుంచి తప్పుకున్నానని వెల్లడించింది. ఈ ఘటన తరువాతైనా సదరు నిర్మాత బుద్ధి తెచ్చుకుంటాడని ఆశిస్తున్నట్టు తెలిపింది. కాగా, అలంకృత 'నమస్తే ఇంగ్లండ్' హిందీ సినిమా ద్వారా పేరుతెచ్చుకుంది.