pv: హైదరాబాద్, నెక్లెస్ రోడ్డులో 26 అడుగుల పీవీ నరసింహారావు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
- పాల్గొన్న గవర్నర్, సీఎం
- పీవీ మార్గ్ ప్రారంభం
- హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో 26 అడుగుల పీవీ నరసింహారావు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా ఈ రోజు హైదరాబాద్‌లోని ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. పీవీ విగ్రహాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.
అలాగే, పీవీ మార్గ్‌ను కూడా ప్రారంభించారు. పీవీ మార్గ్‌లోని జ్ఞానభూమిలో శతజయంతి ముగింపు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పీవీ కుటుంబ సభ్యులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాసేపట్లో పీవీకి సంబంధించిన తొమ్మిది పుస్తకాలను విడుదల చేయనున్నారు. ఇందులో పీవీ రాసినవి 4 ఉండగా, మిగతావి ఆయన జీవితాన్ని విశ్లేషిస్తూ పలువురు రాసినవి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్తంగా ఈ పుస్తకాలను ముద్రించాయి.
కాగా, పీవీ శతజయంతి కార్యక్రమం సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డు వైపు నుంచి వచ్చే వాహనాలను ఖైరతాబాద్ ఫ్లైఓవర్, షాదాన్, నిరంకారీ జంక్షన్ వైపు మళ్లిస్తున్నారు. మినిస్టర్ రోడ్డు నుంచి సంజీవయ్య పార్క్ వైపు వాహనాలను అనుమతించట్లేదు.
వాటిని బుద్ధభవన్ వద్ద దారి మళ్లిస్తున్నారు. అలాగే, ట్యాంక్‌బండ్ నుంచి సంజీవయ్య పార్కుకు వచ్చే వాహనాలు కర్బాలా మైదాన్ వైపు వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. మింట్ కాంపౌండ్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను సైఫాబాద్ ట్రాఫిక్ పీఎస్ వద్ద మళ్లిస్తున్నారు. తెలుగుతల్లి బ్రిడ్జి మీదుగా నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను ఇక్బాల్ మినార్ దగ్గర మళ్లిస్తున్నారు.