Dr Reddys Laboratories: మార్కెట్​ లోకి ‘2డీజీ’.. అందరికీ అందుబాటులోకి

Dr Reddys Commercially Launches DRDO Covid 19 Drug 2DG

  • కరోనా ఔషధాన్ని విడుదల చేసిన రెడ్డీస్
  • ధర రూ.990.. స్వచ్ఛత 99.5 శాతం
  • ప్రభుత్వ సంస్థలకు సబ్సిడీ ధరలకే సరఫరా
  • తొలినాళ్లలో మెట్రోలు, పెద్ద నగరాలకు

డీఆర్డీవోతో కలిసి అభివృద్ధి చేసిన కరోనా ఔషధం ‘2డీజీ (2 డీ ఆక్సీ డీ గ్లూకోజ్)’ని డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సంస్థ ఇవ్వాళ మార్కెట్ లోకి విడుదల చేసింది. వాస్తవానికి రెండు నెలల క్రితమే మందును విడుదల చేసినా.. కేవలం కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులకే అది అందుబాటులో ఉంది. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులూ, వ్యవస్థలు, సంస్థలూ కొనుగోలు చేసేలా వాణిజ్య విపణిలోకి మందును డాక్టర్ రెడ్డీస్ విడుదల చేసింది.

ధరలో ఎలాంటి మార్పు లేదని ప్రకటించింది. ఒక ప్యాకెట్ ధర రూ.990 అని తెలిపింది. ప్రభుత్వ సంస్థలకు సబ్సిడీ రేట్లకే ఇస్తామంది. ఔషధ స్వచ్ఛత 99.5 శాతమని రెడ్డీస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఔషధాన్ని సరఫరా చేస్తామని ప్రకటించింది. తొలినాళ్లలో మెట్రోలు, టయర్ 1 (పెద్ద) నగరాలకు సరఫరా చేస్తామంది. ఆ తర్వాత ఉత్పత్తిని పెంచి మిగతా అన్ని ప్రాంతాలకూ పంపిణీ చేస్తామని వివరించింది. ఔషధం కావాల్సిన వారు [email protected]కు మెయిల్ పంపించొచ్చని చెప్పింది.

కొవిడ్ సోకిన పేషెంట్లపై 2డీజీ ఔషధ పరిశోధనల కోసం తమ దీర్ఘకాలిక భాగస్వామి డాక్టర్ రెడ్డీస్ తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని డీఆర్డీవో చైర్మన్ జి. సతీశ్ రెడ్డి చెప్పారు. కరోనా చికిత్స కోసం వివిధ సాంకేతికలను వినియోగంలోకి తీసుకొచ్చి కరోనా పోరులో తమ వంతు సాయమందిస్తున్నామన్నారు. ఇప్పటికే తమ పోర్ట్ ఫోలియోలో కొవిడ్ వ్యాక్సిన్ ఉందని, ఇప్పుడు 2డీజీ ఔషధ రూపంలో మరొకటి వచ్చి చేరిందని డాక్టర్ రెడ్డీస్ చైర్మన్ సతీశ్ రెడ్డి అన్నారు. కరోనాతో పోరులో డీఆర్డీవోతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు.

కాగా, డీఆర్డీవోకి చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ (ఇన్మాస్), డాక్టర్ రెడ్డీస్ సంయుక్తంగా ఈ 2డీజీ ఔషధాన్ని అభివృద్ధి చేశాయి. మే 1న ఈ మందుకు కేంద్ర ప్రభుత్వం అత్యవసర వినియోగ అనుమతులను మంజూరు చేసింది.

  • Loading...

More Telugu News