Facebook: గూగుల్​, ఫేస్​ బుక్​ లకూ పార్లమెంట్​ ప్యానెల్​ నోటీసులు

Yet another move parliamentary panel summons Facebook and Google
  • రేపు సాయంత్రం 4 గంటల్లోగా హాజరు కావాలని ఆదేశం
  • ఐటీ చట్టం కొత్త నిబంధనల అమలుపై ప్రశ్నలు
  • ఇప్పటికే ట్విట్టర్ ను విచారించిన స్థాయీ సంఘం
సమాచార సాంకేతిక (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ–ఐటీ) నిబంధనల కోరలకు కేంద్ర ప్రభుత్వం మరింత పదును పెడుతోంది. ఇక్కడ ఉండాలంటే ఇక్కడి చట్టాలను గౌరవించి పాటించాల్సిందేనంటూ ట్విట్టర్ కు తేల్చి చెప్పిన పార్లమెంట్ ప్యానెల్.. తాజాగా దిగ్గజ సంస్థలు ఫేస్ బుక్, గూగుల్ లకూ సమన్లను అందించింది.

రేపు సాయంత్రం 4 గంటలలోగా పార్లమెంట్ స్థాయీ సంఘం ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశాలిచ్చింది. కొత్త ఐటీ చట్టంలోని నిబంధనల అనుసరణ, అమలుకు సంబంధించి వివరాలను అడిగింది. భారత పౌరుల హక్కుల రక్షణకు సంబంధించి సంస్థలు తీసుకుంటున్న చర్యలు, సోషల్ మీడియాలో పెరిగిపోతున్న ‘అసభ్య, వేధింపుల’ కంటెంట్ల నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై ప్రశ్నించనుంది. మహిళా భద్రతకు తీసుకుంటున్న చర్యలేంటో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. జులై 6వ తేదీన రావాల్సిందిగా ఇటు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖనూ ఆదేశించింది.

  కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలో ఐటీపై వేసిన పార్లమెంట్ స్థాయీ సంఘం 10 రోజుల క్రితమే ట్విట్టర్ ను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన సంగతి తెలిసిందే. సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి భారత్ లో గ్రీవెన్స్ అధికారిని ఎందుకు నియమించలేదని నిలదీసింది. భారత్ ఐటీ చట్టాలను ఎందుకు పాటించట్లేదని ప్రశ్నించింది.

అయితే, తాము తమ సంస్థ విధానాలనే పాటిస్తామని ట్విట్టర్ తరఫున హాజరైన సంస్థ లీగల్ అధికారి ఆయుషి కపూర్, పబ్లిక్ పాలసీ మేనేజర్ షాగుఫ్తా కమ్రాన్ చెప్పారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థాయీ సంఘం.. ఇక్కడ వ్యాపారం చేసుకోవాలంటే ఇక్కడి చట్టాలు, నిబంధనలను పాటించే తీరాల్సిందేనంటూ తేల్చి చెప్పింది.
Facebook
Google
Parliament
IT Rules

More Telugu News