Revanth Reddy: తనను పరామర్శించిన రేవంత్ రెడ్డికి సూచనలు చేసిన వీహెచ్!
- ఆసుపత్రిలో ఉన్న వీహెచ్ కు రేవంత్ పరామర్శ
- ఆసుపత్రిలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై చర్చించారన్న రేవంత్
- అతి పెద్ద దళిత ద్రోహి కేసీఆర్ అని మండిపాటు
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావును పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, వీహెచ్ ఆరోగ్యం బాగోలేదని తెలిసి పరామర్శించడానికి వచ్చానని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడిందని చెప్పారు. హాస్పిటల్ లో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై ఆయన చర్చించారని తెలిపారు. దళితులకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ద్రోహంపై పోరాడాలని తనకు సూచించారని చెప్పారు. పార్టీ అభివృద్ధి విషయానికి సంబంధించి కొన్ని సలహాలను ఇచ్చారని తెలిపారు. సోనియాగాంధీ వద్దకు కలిసి వెళదామని చెప్పారని అన్నారు.
ఈ ప్రపంచంలో అతి పెద్ద దళిత ద్రోహి కేసీఆర్ అని రేవంత్ మండిపడ్డారు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెడితే... ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టారని విమర్శించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతామని చెప్పారని... కానీ, ఇంత వరకు తట్టెడు మట్టి కూడా తీయలేదని దుయ్యబట్టారు. దళితులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని అన్నారు. వీహెచ్ ఇచ్చిన సలహాలు, సూచనలతో ముందుకు వెళతానని చెప్పారు.