Jagan: 8 జిల్లాల్లో కర్ఫ్యూని సడలిస్తూ సీఎం జగన్ నిర్ణయం
- ఏపీలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు
- ఎనిమిది జిల్లాల్లో రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ
- వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్షలో జగన్ నిర్ణయం
కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూ నిబంధనలను సడలించింది. ఈ జిల్లాల్లో కర్ఫ్యూ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే ఉంటుంది. ఈరోజు వైద్యారోగ్య శాఖ అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు.
కోవిడ్ పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువగా ఉన్న జిల్లాల్లో ఈ మేరకు సడలింపులు ఇవ్వాలని ఈ సమీక్షలో జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, చిత్తూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో మాత్రం కర్ఫ్యూ యథాతథంగా కొనసాగనుంది. ఈ జిల్లాల్లో సాయంత్రం ఆరు గంటల వరకే సడలింపు ఉంటుంది. తాజా నిర్ణయాలు జులై 1 నుంచి 7వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. ఆ తర్వాత మిగిలిన ఐదు జిల్లాలపై కూడా నిర్ణయం తీసుకుంటారు.