Mariyamma: లాకప్ డెత్ మృతురాలు మరియమ్మ కుటుంబాన్ని ఆదుకున్న తెలంగాణ సర్కారు
- ఇటీవల లాకప్ లో మరణించిన మరియమ్మ
- రాజకీయ దుమారం రేపిన ఘటన
- కోమట్లగూడెంలో పర్యటించిన మంత్రి పువ్వాడ
- మరియమ్మ కుటుంబ సభ్యులకు సాయం అందజేత
ఇటీవల మరియమ్మ అనే దళిత మహిళ అడ్డగూడూరులో లాకప్ డెత్ కు గురవడం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మరియమ్మ కుటుంబాన్ని ఆదుకుంది. ఇవాళ తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లాలోని కోమట్లగూడెం గ్రామంలో పర్యటించారు. మరియమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మరియమ్మ కుమారుడు ఉదయ్ కిరణ్ కు ప్రభుత్వ ఉద్యోగం ఆర్డర్‌తో పాటు రూ.15 లక్షలు అందజేశారు. మరియమ్మ ఇద్దరు కుమార్తెలకు చెరో రూ.10 లక్షలు అందించారు.
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ, మరియమ్మ మృతి అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, జడ్పీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.