Corona Virus: కొవిషీల్డ్ రెండో డోసు 10 నెలల తర్వాత ఇచ్చినా ఫరవాలేదు: ఆక్స్‌ఫర్డ్ అధ్యయనం
- 45 వారాల తర్వాత మరింత బలమైన రోగనిరోధకత
- మూడో డోసు 6 నెలలకు ఇచ్చినా మేలే
- టీకా కొరత నేపథ్యంలో ఉపశమనం
- ఫలితాల్ని ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది
ప్రపంచవ్యాప్తంగా టీకాల కొరత వేధిస్తున్న వేళ కొవిషీల్డ్ టీకాను ఔషధ సంస్థ ఆస్ట్రాజెనెకాతో కలిసి అభివృద్ధి చేసిన ఆక్స్‌ఫర్డ్ అధ్యయనం ఆసక్తికరమైన విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. టీకా రెండు డోసుల మధ్య వ్యవధి బాగా ఎక్కువగా వున్నా ఫలితం మాత్రం బాగానే ఉంటుందని తెలిపింది. పైగా రోగనిరోధకత మరింత బలంగా తయారవుతుందని పేర్కొంది.
తొలి, రెండో డోసు మధ్య వ్యవధి 45 వారాలకు పెంచడం వల్ల మరింత బలమైన రోగనిరోధకత ఏర్పడినట్లు అధ్యయనం పేర్కొంది. ఈ ఫలితాల్ని ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. ఇక రెండో డోసు ఇచ్చిన ఆరు నెలల తర్వాత బూస్టర్ డోసు ఇవ్వడం కూడా యాంటీబాడీలను గణనీయ స్థాయిలో పెంచినట్లు అధ్యయనం పేర్కొంది.
వ్యాక్సిన్ల కొరతతో ఆందోళన చెందుతున్న దేశాలకు ఇది ఉపశమనం కలిగించే వార్త అని ఈ అధ్యయనంలో పాల్గొన్న ప్రధాన పరిశోధకురాలు ఆండ్రూ పొలార్డ్ అభిప్రాయపడ్డారు. తొలి డోసు ఇచ్చిన 10 నెలల తర్వాత రెండో డోసు ఇచ్చినా అద్భుతమైన రోగనిరోధకత ఏర్పడుతోందని తెలిపారు. అయితే, కొత్త రకాలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో బూస్టర్ డోసు అవసరమా.. లేదా.. అనే అంశం ఇప్పుడే చెప్పలేమన్నారు.