Modi: నిర్మలమ్మ ఉద్దీపనపై మోదీ ప్రశంస!
- వైద్యారోగ్య రంగంలో మౌలిక వసతుల మెరుగు
- వైద్య రంగంలో ప్రైవేటు పెట్టుబడుల పెరుగుదల
- ఉపాధి అవకాశాలు పుంజుకుంటాయి
- ప్యాకేజీపై మోదీ ఆశాభావం
- కేంద్రం రూ.6,28,993 కోట్లతో భారీ ఉద్దీపన ప్యాకేజి
కొవిడ్-19 మూలంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తెరిపిన పడేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించిన పలు ఉపశమన కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా ప్రశంసించారు. కొవిడ్ ప్రభావిత రంగాలకు ఊతమిచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 8 రకాల ఉపశమనాలను ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆర్థిక శాఖ తీసుకున్న నిర్ణయాల వల్ల వైద్యారోగ్య రంగంలో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రూ.1.1 లక్షల కోట్ల రుణ హామీ పథకం వల్ల స్వయం ఉపాధి పొందుతున్న వారు, ఔత్సాహిక వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలను చక్కబెట్టుకునేందుకు అవకాశం లభిస్తుందన్నారు.
అలాగే, ఆర్థిక శాఖ తీసుకున్న నిర్ణయాల వల్ల ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయని.. తద్వారా తయారీ, ఎగుమతులు సైతం గాడిన పడతాయన్నారు. దీంతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. పిల్లల సంరక్షణ, ఆరోగ్యంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తూ కేటాయించిన రూ.23,220 కోట్ల ప్యాకేజీని ఈ సందర్భంగా మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలాగే రైతులకు ప్రాధాన్యం ఇచ్చారన్నారు.
కరోనా సంక్షోభం నేపథ్యంలో కేంద్రం రూ.6,28,993 కోట్లతో భారీ ఉద్దీపన ప్యాకేజి ప్రకటించిన విషయం తెలిసిందే. వైద్య రంగానికి రూ.50 వేల కోట్లు కేటాయించారు. అలాగే పర్యాటక రంగాన్ని ఆదుకునేందుకు పలు ప్రయోజనాలు ప్రకటించారు.